
మద్దెల వాగుపై నయా దారి.. గ్రామీణ ప్రాంతాలకు కొత్త రవాణా….
రూ.5.43 కోట్లతో నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జి ప్రారంభం
గ్రామీణ ప్రజల సౌకర్యమే లక్ష్యంగా అభివృద్ధి పనులు….
— ప్రభుత్వ విప్ విజయరమణారావు…
పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి,కాల్వ శ్రీరాంపూర్/ : గతంలో రహదారులు, మౌలిక వసతులు లేక ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులకు కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కారం చూపుతోందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం జాఫర్ ఖాన్ పేట గ్రామంలో రూ.5.43 కోట్ల వ్యయంతో నిర్మించిన మద్దెల వాగు హై లెవెల్ బ్రిడ్జిని ఆయన ప్రారంభించారు.
అనంతరం గోదావరిఖని–జాఫర్ ఖాన్ పేట–పెద్దపల్లి ఆర్టీసీ బస్సు సర్వీసును జెండా ఊపి ప్రారంభించారు. గ్రామంలో రూ.15 లక్షల నిధులతో నిర్మించిన పలు సీసీ రోడ్లను స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో గడపగడపకు కాంగ్రెస్, ఇంటింటికీ విజ్జన్న కార్యక్రమంలో ప్రజలను కలిసినప్పుడు రహదారులు, మౌలిక సదుపాయాలు లేక గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులను ప్రత్యక్షంగా చూశామని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం గ్రామాల్లో అభివృద్ధి పనులకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు.
జాఫర్ ఖాన్ పేటలో పాఠశాల పునర్నిర్మాణం, కాంపౌండ్ వాల్ నిర్మాణంతో పాటు గ్రామంలోని అన్ని వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామని చెప్పారు. రూ.5.43 కోట్లతో మద్దెల వాగు బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయడంతో పాటు అప్రోచ్ రోడ్ల కోసం మరో రూ.కోటి ఖర్చు చేసి ప్రజల రవాణా కష్టాలను తొలగించామని పేర్కొన్నారు.
కోట్లాది రూపాయలతో రహదారుల అభివృద్ధి
సుల్తానాబాద్–పెద్దపల్లి–ముత్తారం ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు పలు కీలక రహదారులకు నిధులు మంజూరైనట్లు విజయరమణారావు తెలిపారు. మంగపేట కూనారం టర్నింగ్ నుంచి ముత్తారం వరకు రూ.32 కోట్లతో డబుల్ రోడ్డు, పెద్దపల్లి–గర్రెపల్లి మేజర్ రోడ్డుకు రూ.100 కోట్లు, సుల్తానాబాద్–పెద్దపూర్ రోడ్డుకు రూ.47 కోట్లు, కూనారం–పెద్దపల్లి రోడ్డుకు రూ.14 కోట్లు, జాఫర్ ఖాన్ పేట రింగ్ రోడ్డుకు రూ.7 కోట్లు, శ్రీరాంపూర్ హెడ్‌క్వార్టర్ సెంట్రల్ లైటింగ్‌కు రూ.5.50 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు వెల్లడించారు.
ఈ అభివృద్ధి పనులకు ఆగస్టు 17న సుల్తానాబాద్‌లో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జిల్లా మంత్రి శ్రీధర్‌బాబు చేతుల మీదుగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యం
శ్రీరాంపూర్ మండలంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటంతో చెరువులు మత్తడి దూకుతున్నాయని ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పత్తి, వరి పంటలకు అనుకూలంగా ఉన్నాయని, ఈసారి పత్తి సాగులో ఎకరాకు 15 క్వింటాళ్లకు తగ్గకుండా దిగుబడి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రుల సహకారంతో రైతులకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు త్వరలో పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుడతామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులకు ఆశించిన స్థాయిలో సాగునీటి ప్రయోజనం అందలేదని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ యాదగిరి జోష్నా శ్రీనివాస్, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గజవేన సదయ్య, కాంగ్రెస్ నాయకులు ఎండీ మునీర్, లంక సదయ్య, తుల మనోహర్‌రావు, దేవేందర్‌రావు, వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.