Spread the love
  • 20 ఏళ్లుగా చెప్పులు కుట్టి జీవించే వారిపై మున్సిపల్ అధికారుల ప్రతాపం ఆపాలి:

షెడ్లతొలగింపు ను ఆపకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతిఘటిస్తామని హెచ్చరిక………… సిపిఐ

వనపర్తి పట్టణంలోని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఎదుట షెడ్లు నిర్మించుకొని చెప్పులు కుట్టి జీవించే చర్మకారులపై మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ సిబ్బంది ప్రతాపం చూపించడం ఆపాలని సిపిఐ పట్టణ కార్యదర్శి జే రమేష్, జిల్లా నేత గోపాలకృష్ణ డిమాండ్ చేశారు. శనివారం మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద, మున్సిపల్ సిబ్బంది కూల్చివేసిన చర్మకారుల షెడ్డును, తొలగించిన బండలను పరిశీలించారు. అనంతరం అంబేద్కర్ చౌక్ లో డ్రైనేజీలను ఆక్రమించి కొందరు నిర్మించిన మెట్లను, బ్లాక్ అయిన డ్రైనేజీ ని పరిశీలించి మాట్లాడారు. మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద భారీ డ్రైనేజీ పై చెప్పులు కుట్టే దళితులు 20 ఏళ్ల క్రితం నుండి తడికల షెడ్డు వేసుకొని చెప్పులు కుట్టి బతుకుతున్నారన్నారు. డ్రైనేజీ మురుగు తీసేందుకు షెడ్లు అడ్డంగా ఉన్నాయనే నెపంతో సానిటరీ ఇన్స్పెక్టర్ వాటిని తీయించాలని సిబ్బంది పురమయిస్తున్నారన్శారు. శనివారం మున్సిపల్ సిబ్బంది ఒక షెడ్డును బండలను ధ్వంసం చేశారన్నారు. షెడ్లను తొలగించకుండానే డ్రైనేజీని శుభ్రం చేసే అవకాశం ఉన్నప్పటికీ, ఉద్దేశపూర్వకంగా చెప్పులు కుట్టే దళితులను అక్కడి నుంచిపంపేయాలన్న దురుద్దేశమే అధికారులలో కనిపిస్తోందన్నారు. షెడ్లను తొలగిస్తే చెప్పులు కుట్టే దళితుల బతుకులు రోడ్డున పడతాయన్నారు. అంబేద్కర్ చౌక్ రోడ్డు, రాజీవ్ చౌక్, కొత్త బస్టాండ్, జూనియర్ కాలేజ్ రోడ్డు, వివేకానంద చౌరస్తాతదితర ప్రాంతాల్లో రోడ్డు పక్కన పెద్ద పెద్ద ఇల్లు షాపులు నిర్మించుకున్న వారు డ్రైనేజీలను ఆక్రమించి మెట్లు నిర్మించారన్నారు.

డ్రైనేజీలపై నిర్మించిన మెట్లను తొలగించమని మున్సిపల్ అధికారులు ఎందుకు అడగడం లేదన్నారు. డ్రైనేజీలపై మెట్లు నిర్మించడంతో చెత్త చెదారం డ్రైనేజీల్లో పేరుకుపోయి రోడ్లపై వెళ్లే వారికి కంపు కొడుతోందన్నారు. డ్రైనేజీలు ఆక్రమించి మెట్లు నిర్మించిన వారు సంపన్నులు కావడంతో మెట్లు తీయమని అడిగే ధైర్యం మున్సిపల్ అధికారులు శానిటరీ ఇన్స్పెక్టర్కు లేదన్నారు. చెప్పులు కుట్టేవారు పేదవారు కావడంతో డ్రైనేజీ పై షెడ్డు తీయమని వేధిస్తున్నారని విమర్శించారు.ముందుగా డ్రైనేజీలపై నిర్మించిన సంపన్నుల ఇండ్లు, షాపుల మెట్లను తొలగించి, తర్వాత మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ వద్దచెప్పులు కుట్టే వారి షడ్ల వద్దగల డ్రైనేజీ జోలికి రావాలన్నారు. అంతవరకు దళితుల షెడ్లు తీయమని కోరే నైతికత సానిటరీ ఇన్స్పెక్టర్ మున్సిపల్ అధికారులకు లేదన్నారు. దౌర్జన్యంగా షెడ్లను తొలగించే ప్రయత్నం చేస్తే ప్రజాస్వామ్య పద్ధతిలో వివిధ ఆందోళన రూపాలతో ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. సిపిఐ నేత చిన్న కురుమన్న, చెప్పులు కుట్టే కార్మికులు శాంతయ్య, వెంకటేశ్వర్లు, నజీర్, భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.