
నోట్ల కట్టల కేసులో జస్టిస్ వర్మ ఇంటికి త్రిసభ్య కమిటీ
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగిన సందర్భంలో బయట పడ్డ నోట్ల కట్టలు కేసులో సుప్రీంకోర్టు దర్యాప్తు ముమ్మరం చేస్తుంది.
ఈ నేపథ్యంలో ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నియమించిన ముగ్గురు ప్రధాన న్యాయమూర్తుల కమిటీ మంగళవారం జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటికి వెళ్లింది.
కమిటీ సభ్యులు జస్టిస్ శీల్ నాగు (పంజాబ్, హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి), జస్టిస్ జి.ఎస్.సంధావాలియా (హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి), జస్టిస్ అను శివరామన్ (కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి) మంగళవారం జస్టిస్ వర్మ ఇంటిని సందర్శించారు.
అక్కడ 30-35 నిమిషాలపాటు ఉండి జస్టిస్ వర్మ ఇంటి ప్రాంగణాన్ని, అక్కడ అగ్నిప్రమాదం జరిగిన స్టోర్ రూమ్‌ను నిశితంగా పరిశీలించారు. మధ్యాహ్నం సమయానికి అక్కడనుండి వెళ్లిపోయారు.
ఆ సమయంలో జస్టిస్ వర్మ ఇంట్లో ఉన్నారా లేరా అనే విషయం ఇంకా తెలియరాలేదు. మరోవైపు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలన్న సుప్రీం సిఫారసును వ్యతిరేకిస్తూ అలహాబాద్ హైకోర్టు న్యాయవాదులు నిరవధిక సమ్మెకు దిగారు.
అవినీతికి పాల్పడ్డవారిపై, పారదర్శకత లేని వ్యవస్థపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ‘‘(జస్టిస్ వర్మ) బదిలీ ఉత్తర్వును పునఃపరిశీలించి, ఉపసంహరించుకోవాలన్నదే మా ప్రధాన డిమాండ్’’ అని ఆయన పేర్కొన్నారు.
