Spread the love

బెట్టింగ్ యాప్ స్కామ్, మాజీ సీఎం భూపేష్ బాఘేల్ ఇంట్లో సీబీఐ ఆకస్మిక తనిఖీలు

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్ మహాదేవ్ బెట్టింగ్ యాప్ తో చిక్కుల్లో ఇరుక్కున్నారు. 6,000 కోట్ల రూపాయల ఈ బెట్టింగ్ యాప్ స్కామ్ కేసులో భూపేశ్ బాఘేల్ నివాసంపై సీబీఐ దాడులు చేసింది.

రాయ్‌పూర్, బిలాయ్ లోని ఆయన నివాసాలపై బుధవారం నాడు సీబీఐ ఆకస్మిక దాడులు చేసింది. ఇంటితో పాటు భిలాయ్‌లో ఆయన ఇంటిపై సీబీఐ తనిఖీలు చేపట్టింది. ఆయనకు సన్నిహితుడైన పోలీస్ అధికారి నివాసంలోనూ దాడులు కొనసాగుతున్నాయి.

ఆరు వేల కోట్ల మహాదేవ్ బెట్టింగ్ యాప్స్ వ్యవహారానికి సంబంధించి ఛత్తీస్‌గఢ్ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం నుంచి సీబీఐ దర్యాప్తును చేపట్టింది, ఈ విభాగం బాఘేల్‌తో పాటు యాప్ ప్రమోటర్లు రవి ఉప్పల్, సౌరభ్ చంద్రకర్, శుభం సోని, అనిల్ కుమార్ అగర్వాల్ మరో 14 మంది పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.

ఈ బెట్టింగ్ యాప్ కేసులో పలువురు నేతలు, అధికారుల ప్రమేయం ఉందని తన దర్యాప్తులో తేలిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఆరోపించింది. బాఘేల్ మాత్రం ఈ కేసును రాజకీయ కక్షతో నమోదు చేసిన కేసుగా పేర్కొన్నారు.

అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ వెబ్‌సైట్‌లకు ఈ బెట్టింగ్ యాప్ ఒక సిండికేట్ ప్లాట్‌ఫారమ్‌ అని అధికారులు చెబుతున్నారు. కొత్త వినియోగదారులను యాడ్ చేసుకుని, యూజర్ ఐడీలను క్రియేట్ చేసి బినామీ బ్యాంక్ ఖాతాలతో మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ అధికారులు గుర్తించారు.