Spread the love

వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చర్యలు చేపట్టండి. – మేయర్ డాక్టర్ శిరీష

చలివేంద్రాలు ఏర్పాటు చేయండి.- కమిషనర్ ఎన్.మౌర్య

వేసవి కాలంలో నగర ప్రజలకు త్రాగునీటి ఎద్దడి రాకుండా, ఎండ నుండి ఉపశమనం కలిగేలా తగు చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష అధికారులను ఆదేశించారు. వేసవి నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అన్ని విభాగాల అధికారులతో మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ ఎన్.మౌర్య సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా విభాగాల ఆధ్వర్యంలో చేపట్టనున్న ప్రత్యామ్నాయ ఏర్పాట్లను వివరించారు. నగరంలో ప్రజలకు ఇబ్బందులు త్రాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. ముందస్తుగా నీటి ట్యాంకులు ఏర్పాటు చేయాలని, వేసవిలో వచ్చే సీజనల్ వ్యాదులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. వడ దెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్య సిబ్బందికి ఎండల వలన ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. పలు చోట్ల నీరు వృధాగా పోతున్నదని అరికట్టాలని అధికారులను ఆదేశించారు. త్రాగునీరు కలుషితం కాకుండా చూడాలని అన్నారు. వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని అన్నారు. నగరంలో ప్రైవేట్ నీటి ట్యాంకర్ల యాజమానుల సమావేశం ఏర్పాటు చేసి ఒకే ధరకు నీరు అందించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు.

కమిషనర్ ఎన్.మౌర్య మాట్లాడుతూ తిరుపతి నగరానికి పెద్ద సంఖ్యలో యాత్రికులు వస్తుంటారని వారు ఎండల బారిన పడకుండా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రధాన కూడళ్లలో చలువ పందిళ్ళు, గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య సిబ్బంది పనివేళల్లో మార్పులు చేశామని, మస్టర్ పౌయింట్ల వద్ద త్రాగునీరు, ors పాకెట్లు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. ఎండ వేడిమి నుండి తట్టుకునేలా తగు చర్యలు చేయాలని హెల్త్ ఆఫీసర్ ను ఆదేశించారు. ఎక్కడా మురుగునీరు నిలకుండా, దోమలు వృద్ధి చెందకుండా జాగ్రత్తలు చేపట్టాలని అన్నారు.
ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, డీసీపీ మహాపాత్ర, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, మేనేజర్ హాసీమ్, డి.ఈ.లు, తదితరులు ఉన్నారు.