
ప్రజల అవసరాలు, ప్రభుత్వ పథకాల అమలుకు ఇబ్బంది లేకుండా సచివాలయ సిబ్బందిని వినియోగించండి : మాజీ మంత్రి ప్రత్తిపాటి.
- గత ప్రభుత్వం మొక్కుబడి సేవలకు పరిమితం చేసిన సచివాలయ వ్యవస్థను, కూటమి ప్రభుత్వం ప్రజాసేవలో భాగం చేసింది : ప్రత్తిపాటి
గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని ప్రజల అవసరాలు, ప్రభుత్వ పథకాలు, కార్యకలాపాల నిర్వహణకు తగినట్టుగా వినియోగించుకోవాలని, వారి సేవలు ఎక్కడ అవసరమో గుర్తించి, సిబ్బంది విలీన, బదిలీ ప్రక్రియను అధికారులు సమర్థవంతంగా చేపట్టాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. శుక్రవారం నియోజకవర్గంలోని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ తో మాజీమంత్రి ప్రత్తిపాటి తన నివాసంలో సచివాలయాల విలీనం, సిబ్బంది బదిలీ, వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ప్రభుత్వ పథకాల అమల్లో ఎంపీడీవోలు బాధ్యతతో పనిచేయాలని, సచివాలయ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ, మంచి ఫలితాలు రాబట్టాలన్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమల్లో ఎలాంటి తప్పులు జరగడానికి వీల్లేదని, ప్రజల సంతృప్తి స్థాయి పెంచేలా క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరు ఉండాలని ప్రత్తిపాటి స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పాలన ఉండాలని, అభివృద్ధిపనుల్లో వేగం పెంచాలని ఆయన తెలిపారు.
గత ప్రభుత్వం సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థను కేవలం కొన్ని కార్యక్రమాలకే మొక్కుబడిగా వినియోగించిదని, కూటమిప్రభుత్వం ప్రజలు మెచ్చేలా, వారికి అందుబాటులో ఉండేలా సచివాలయ సిబ్బందితో పనిచేయిస్తోందన్నారు. జనాభా ప్రాతిపదిక న సిబ్బంది వినియోగం ఉండాలని, సచివాలయాల విలీనం, సిబ్బంది బదిలీ ప్రక్రియ అంతా నిబంధనల ప్రకారమే జరగాలని, చిన్నతప్పుకి కూడా స్థానం లేకుండా పారదర్శకంగా చేయాలని ప్రత్తిపాటి ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. సమావేశంలో నియోజకవర్గంలోని పట్టణ, మూడు మండలాల అధ్యక్ష, కార్యదర్శులు జవ్వాజి మధన్ మోహన్, బండారుపల్లి సత్యనారాయణ, కామినేని సాయి బాబు, పఠాన్ సమాధ్ ఖాన్, మద్దుమలా రవి, మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి, ఎంపీడీవో లు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.
