
ముంబైకి మంత్రి జూపల్లి కృష్ణారావు
20వ దక్షిణాసియా హోటల్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ & వర్క్ షాప్ లో పాల్గొననున్న మంత్రి
హైదరాబాద్, : పర్యాటక రంగంలో పెట్టుబడులను ప్రొత్సహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఏప్రిల్ 10న ముంబైలో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నారు. ముంబై పోవై లేక్ లో ( 8 నుంచి 10వ తేదీ వరకు) జరుగుతున్న 20వ దక్షిణాసియా హోటల్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ & వర్క్ షాప్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొననున్నారు.
ఇన్వెస్టర్లకు మెరుగైన రాయితీలు కల్పించి పూర్తి సహకారం అందిస్తామని మంత్రి జూపల్లి భరోసా కల్పించనున్నారు. తెలంగాణ నూతన పర్యాటక పాలసీతో పాటు ఎకో, టెంపుల్, మెడికల్ టూరిజంలో ఉన్న అవకాశాలను మంత్రి వివరించనున్నారు. ఆతిథ్య రంగంలో పెట్టుబడుల అవకాశాలను వివరించి ఇన్వెస్టర్లను తెలంగాణకు మంత్రి జూపల్లి ఆహ్వానించనున్నారు. పర్యాటక రంగంలో రూ. 15 వేల కోట్ల పెట్టుబడులను సమీకరించడం.. తద్వారా 3 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ సందర్భంగా తెలిపారు.
