
పాపం.. కేటీఆర్ ను కాపాడేందుకు రంగంలోకి హరీష్ రావు!
కంచ గచ్చిబౌలిలో 400ఎకరాల భూముల విషయంలో బిగ్గెస్ట్ స్కామ్ అంటూ కేటీఆర్ చేసిన రాజకీయం వికటించింది. భూముల పేరిట సర్కార్ సొమ్ము చేసుకోవడం కేసీఆర్ హయాంలోనూ జరిగింది.. ఇప్పుడు రేవంత్ కూడా అదే చేస్తున్నారు. చేశారు. దాన్ని కేటీఆర్ కుంభకోణం కింద లెక్క కట్టేశారు. ఆయన ప్రెస్ మీట్ మొత్తం చూసినా అందులో స్కామ్ అనేదానికి ఆధారం ఏముందో ఎవరికీ అర్థం కాలేదు. ఒక్క కేటీఆర్ , బీఆర్ఎస్ కు తప్పా.
TGIIC ద్వారా 400 ఎకరాల భూమిని తాకట్టు పెట్టి, ICICI బ్యాంకు నుండి బాండ్ల రూపంలో పదివేల కోట్లు తీసుకుందని కేటీఆర్ చెప్పారు. సర్కార్ బాండ్ల రూపంలో పదివేల కోట్లు పొందటం స్కామ్ ఏంటో అర్థం కాలేదు. అయినా ఋణం ICICI ఇవ్వలేదు. అవి బాండ్లు మాత్రమే . పదేళ్లు మంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న కేటీఆర్ ఇంత చిన్న విషయం ఎలా మరిచిపోయారు? అని సందేహం అందరికీ వస్తుంది.
భారీ అంచనాల నడుమ ప్రెస్ మీట్ పెట్టి.. ఊదరగొట్టిన కేటీఆర్ నవ్వులపాలయ్యారు. భారీ స్కామ్ ను బయటపెడుతున్నట్లు ప్రకటించి స్కామ్ అనేదానికి ఆధారాలు లేకుండా ప్రెస్ మీట్ ను నిర్వహించడం పట్ల బీఆర్ఎస్ వర్గాలే ఆశ్చర్యపోయాయి. HCU భూముల విషయంలో రేవంత్ ను ఎలాగైనా బద్నాం చేయాలనే ఆరాటం తప్ప , కుంభకోణం అనేదానికి కేటీఆర్ సరైన ఆధారాలు చూపించలేదు.
కేటీఆర్ రాజకీయం బెడిసికొట్టడంతో బీఆర్ఎస్ హరీష్ రావును రంగంలోకి దించినట్లు కనిపిస్తోంది. మొదటి నుంచి ఈ భూవివాదం విషయంలో హరీష్ రావు అగ్రెసివ్ గా లేరు. ఆయన ఎందుకో ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కేటీఆర్ ఒక్కరే HCU భూవివాదాన్ని ఎక్కువగా ఎక్స్ పోజ్ చేశారు. ఈ క్రమంలోనే కేటీఆర్ పాలిటిక్స్ తేలిపోవడంతో.. హరీష్ కొత్త పాయింట్ తో వచ్చినట్లు కనిపిస్తోంది.
TGIIC ద్వారా 400 ఎకరాలు తనఖా పెట్టి రుణం పొందామని అసెంబ్లీలో తాను అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పిందని గుర్తు చేశారు హరీష్ రావు.మరి ICICIBank మేము తనఖా పెట్టుకోలేదు అని చెబుతోందని..అంటే ఆ 400 ఎకరాల కంచ గచ్చిబౌలి భూమిని ప్రభుత్వం ఎవరి వద్ద తనఖా పెట్టినట్లు?అని ప్రశ్నించారు. దీనిపై సర్కార్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నానని చెప్పుకొచ్చారు.
ఈ విషయంపై ప్రభుత్వం స్పందిస్తే క్లారిటీ వస్తుంది. అయితే, హరీష్ సడెన్ గా ఈ విషయంపై రియాక్ట్ కావడం వెనక కేటీఆర్ తొందరపడి పసలేని రాజకీయం చేయడమే కారణమని, ఈ విషయంలో కేటీఆర్ ను గట్టెక్కించేందుకు ఎంట్రీ ఇచ్చారనే అభిప్రాయం వినిపిస్తోంది.
