
అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే మెగా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి లు పిలుపు
వనపర్తి
వనపర్తి జిల్లా
అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి పిలుపునిచ్చారు.
భారత రత్న డా. బాబా సాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని సోమవారం ఉదయం స్థానిక అంబేడ్కర్ కూడలిలోని అంబేడ్కర్ విగ్రహానికి రాష్ట్ర స్పోర్ట్స్ అధారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జి యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, డి.సి.సి.బి. చైర్మన్ మామిళ్ళ పల్లి విష్ణు వర్ధన్ రెడ్డి, ఇతర సంఘ నాయకులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం స్థానిక దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి సభలో మాట్లాడారు.
ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి బాగా చదువుకోవాలని, బడుగు బలహీన వర్గాల పేద పిల్లలు బాగా చదువుకొని సమాజంలో ఉన్నత శిఖరాలను అందుకోవడమే అంబేడ్కర్ ఆశయ సాధన అని గుర్తు చేశారు.
బి.ఆర్ అంబేడ్కర్ మహనీయుడనీ, వంద సంవత్సరాల క్రితమే భారత దేశం ఎలా ఉండాలి, చట్టాలు ఏ విధంగా ఉండాలి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు బాటలు వేశారని కొనియాడారు.
ప్రతి ఒక్కరు చదువుకోవాలి, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని తెలియజేశారు.
ఎంతోమంది పోరాటాల అనంతరం ఎస్సీ వర్గీకరణ పై సుప్రీం కోర్టు నుండి తీర్పు వెలువడిన వెంటనే తెలంగాణ రాష్ట్రంలో ఒక కమిటీని వేసి వర్గీకరణ పై నేడు ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని పేర్కొన్నారు.
వనపర్తి పట్టణంలోని నల్ల చెరువుకు అంబేడ్కర్ పేరు పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా జిల్లాలో ఎక్కడ హరిజన వాడలు, హరిజన పాఠశాలలు అని పేరు లేకుండా వాటిని అంబేద్కర్ వాడలు, పాఠశాలలు అని నామకరణం చేయనున్నట్లు తెలిపారు. పట్టణంలో అంబేడ్కర్ విగ్రహం గొప్పగా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని విద్యలో అందరికీ సమాన, ఉన్నత అవకాశాలు కల్పించేందుకు వనపర్తిలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు.
విశ్రాంత ఐ. ఏ.ఎస్ సూచనల మేరకు ప్రతి ఒక మండలంలో కార్పొరేట్ స్థాయిలో ఒక గొప్ప పాఠశాలను ఏర్పాటు చేసి చుట్టు పక్కల గ్రామాల నుండి విద్యార్థులను తరలించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర స్పోర్ట్స్ అధారిటీ చైర్మన్ కొత్తకాపు శివసేన రెడ్డి మాట్లాడుతూ అంబేడ్కర్ ఏ ఒక్క కులానికో, మతానికో దేవుడు కాదని, ప్రతి ఒక్కడికి దేవుడని కొనియాడారు. ప్రతి పేదవారికి న్యాయం జరగాలని, సమాన హక్కులు కల్పించాలని అంబేడ్కర్ కలలు కన్నాడని అన్నారు. అందుకే ప్రతి ఇంటికి అంబేడ్కర్ ఆశయాలను తీసుకువెళ్లడమే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ లండన్ యూనివర్సిటీ నుంచి ఎకనమిక్ లో డాక్టరేట్ పొందిన తొలి భారతీయుడు డా. బి.ఆర్. అంబేడ్కర్ అని కొనియాడారు. పింగళి వెంకయ్య జాతీయ పతాక రూపకల్పన కమిటీలో సభ్యునిగా ఉన్న అంబేడ్కర్ జాతీయ పతాకం మధ్యలో అశోక చక్రం ఉండే విధంగా చూడటంలో అంబేడ్కర్ ముఖ్య భూమిక పోషించాడని గుర్తు చేశారు.
విద్యార్థులు ప్రతి ఒక్కరు కనీసం పోస్ట్ గ్రాడ్యూట్ వరకు చదువుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరు మరింత అభివృద్ధి సాధించి తమ జీవన విధానాన్ని మార్చుకోవాలని కోరారు. అంబేద్కర్ అడుగుజాడల్లో నడవడమే ఆయనకు నిజమైన నివాళి అని సూచించారు.
అనంతరం కుల సంఘం నాయకులను శాలువాలతో సత్కరించారు.
అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జి యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, డి.సి.సి.బి చైర్మన్ మామిళ్ళ పల్లి విష్ణు వర్ధన్ రెడ్డి, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గంధం గట్టయ్య, ఉపాధ్యక్షుడు భోజరాజు, ఈ.డి. ఎస్సీ కార్పొరేషన్ అధికారి మల్లికార్జున, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి అక్బర్, కుల సంఘాల నాయకులు గంధం నాగరాజు, కిరణ్ కుమార్, బోయ వెంకటేష్, రాజారాం, కేశవులు, మహేష్, అక్కమ్మ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
