TEJA NEWS

ప్రజా పాలనలో ప్రజలు మెచ్చి ప్రజలకు నచ్చే భూభారతి చట్టం తీసుకురావడం జరిగింది……. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

వనపర్తి జిల్లా
ప్రజా పాలనలో ప్రజలు మెచ్చే విధంగా ప్రజలకు నచ్చే భూ భారతి ఆర్. ఒ.ఆర్ చట్టం తీసుకురావడం జరిగిందని దేవరకద్ర శాసన సభ్యులు జి మధుసూదన్ రెడ్డి అన్నారు.
గురువారం కొత్తకోట మండలంలోని బి.పి.ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్, మదనపూర్ మండలంలోని రైతు వేదికలో భూ భారతి కొత్త ఆర్.ఒ.ఆర్ చట్టం 2025 పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శాసన సభ్యులు జి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ
ధరణి అంటేనే దరిద్రమనీ
అలాంటి మహమ్మారిని కోట్ల మంది రైతులపై రుద్ది ఇబ్బందులకు గురిచేశారని అన్నారు. ధరణి వల్ల రైతులకు మేలు జరగకపోగా అనేక సమస్యలకు గురిచేశారని తెలిపారు.

ధరణి చట్టం ఒక్క కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే ఉపయోగపడ్డదనీ, రైతుకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి అధికారులు చేతుల్లో ఏమి లేకుండేదని తెలిపారు.
అందుకే గతంలో ఏ అధికారి రైతులకు న్యాయం చేయలేకపోయాడన్నారు.
హైదరాబాద్ సిసిఎల్ లో ఎన్నో లక్షల ఎకరాల భూ సమస్యలకు పరిష్కారం దొరకలేదు.
ఏదైనా చట్టాన్ని తీసుకురావాలంటే మేధావుల సలహాలు సూచనలు తీసుకోవాల్సి ఉంటుందని అందుకే ధరణి చట్టాన్ని బంగాళాఖాతంలో పడేసి రైతులు, కలెక్టర్లు, మేధావులతో సలహాలు సూచనలు తీసుకొని భూ భారతి ఆర్. ఒ.ఆర్ చట్టాన్ని తీసుకువచ్చినట్లు తెలియజేశారు.
చట్టాలు అమలు కావాలంటే వాటికి నియమనిబంధనలు అవసరమని, ధరణి చట్టానికి నియమ నిబంధనలు రూపొందించలేదన్నారు.

టెనెన్సి యాక్ట్ కు సంబంధించి ధరణి చట్టంలో ఎక్కడ రాయబడలేదన్నారు.
చాలామంది అమాయక రైతుల భూములను నిషేధిత జాబితాలో పెట్టి వారి కన్నీటికి కారణమయ్యరనీ గత ప్రభుత్వాన్ని విమర్శించారు.
ధరణి చట్టాన్ని అడ్డం పెట్టుకొని వేల ఎకరాల భూమి కొల్లగొట్టారని, భూ భారతి చట్టం ద్వారా వారు చేసిన దోపిడీని బయటపెడతామని వెల్లడించారు.

18 రాష్ట్రాలలో ఉన్న రెవెన్యూ చట్టాలను పరిశీలించి మేధావులు, రైతుల నుంచి సూచనలు తీసుకొని కొత్త భూభారతి చట్టాన్ని తీసుకు రావడం జరిగిందన్నారు.
రాష్ట్ర ప్రజలందరికీ అనుకూలమైన అంశాలను భూభారతి చట్టంలో పొందుపరిచామనీ,
గతంలో ఎన్నడు లేని విధంగా తహసిల్దార్ కార్యాలయంలోనే 90 శాతం భూ సమస్యలు పరిష్కరించే విధంగా భూభారతిలో వెసులుబాటు ఉందన్నారు.
మూడు నెలల్లోనే చట్టంతోపాటు నియమ నిబంధనలను కూడా పొందుపరచడం జరిగిందన్నారు.
భూమి కోసమే ఒకప్పుడు సాయుధ పోరాటాలు జరిగాయని, భూ సమస్యలు ఇప్పుడు చాలా సులభతరంగా పరిష్కారం అవుతాయన్నారు.
పరిష్కారం దొరకని వాటికి సైతం ప్రభుత్వం తరఫున జిల్లాలో ట్రిబ్యునల్ కోర్టులు నిర్వహించి న్యాయం జరిగేలా చేస్తామన్నారు.
ప్రజల కోసం ప్రజలు నచ్చే విధంగా కాంగ్రెస్ ప్రజాపాలన కొనసాగుతుందన్నారు.
వారసత్వ హక్కులకు అందరికీ సమానంగా శాశ్వత పరిష్కారం దొరకనుందన్నారు.
త్వరలోనే గ్రామ రెవెన్యూ వ్యవస్థను తీసుకురావడం జరుగుతుందని, చాలా సమస్యలు గ్రామ స్థాయిలో పరిష్కారం దొరుకుతాయన్నారు.
జూన్ నెల నుండి ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని, ధరణి వల్ల వచ్చిన సమస్యలను అక్కడే పరిష్కరిస్తామని వెల్లడించారు.

భవిష్యత్తులో మరో వందేళ్లు ఎలాంటి ఇబ్బంది కలగకుండా భూభారతి చట్టాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు.
రైతు పక్షపాతిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గొప్ప నిర్ణయం తీసుకున్నాడనీ
ఇచ్చిన హామీల్లో భాగంగా ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నామన్నారు.
ప్రతి గ్రామంలో భూభారతి చట్టంపై చర్చ జరగాలనీ, చట్టం పై చర్చించాలన్నారు. ధరణి, భూభారతి కి మధ్య గల వ్యత్యాసాలు అందరికీ తెలియాలనీ సూచించారు.

రుణమాఫీ విషయానికి వస్తే కొత్తకోట మండలంలో 5,768 మంది రైతులకు 43 కోట్ల 70 లక్షల రుణమాఫీ జరిగిందన్నారు.
రైతు భరోసా ద్వారా కొత్తకోట మండలంలో 15000 మంది రైతులకు 10 కోట్ల 90 లక్షలు రైతు భరోసా జమ చేయడం జరిగిందన్నారు.
ఇచ్చిన మాట ప్రకారం సన్న వడ్ల కోసం ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ఇస్తుందని కొత్తకోట మండల కేంద్రంలోని 3020 మంది రైతులకు 9.46 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు.
సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని,
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.
ఈ అవగాహన సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ ప్రభుత్వం కొత్తగా ఏ చట్టం తీసుకువచ్చిన చట్టం పై అవగాహన పెంచుకోవాల్సి ఉంటుందని అందుకే కొత్తగా వచ్చిన భూ భారతి ఆర్. ఒ.ఆర్. చట్టం పై మండల స్థాయిలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
ప్రతి వ్యక్తికి భూమితో సంబంధం ఉంటుందని ఏదో ఒక సమయంలో అవసరం వస్తుందన్నారు. అంత ముఖ్యమైన భూమి, భూ చట్టాల పై ప్రతి ఒక్కరు అవగాహన చేసుకోవాలని సూచించారు. సమస్యలు వచ్చి న్యాయ వ్యవస్థకు వెళ్ళాక చట్టంలో ఉన్న అంశం నాకు తెలియదు అనిచెప్పడానికి వీలు లేదన్నారు.
ఇంతకు ముందు ఉన్న ధరణి చట్టంలో ఉన్న సమస్యల పరిష్కారానికి మేధావులతో చర్చించి పటిష్టమైన భూ భారతి చట్టాన్ని తీసుకురావడం జరిగిందన్నారు.
భూ భారతి చట్టం ప్రకారం ఏదైనా భూమి రిజిస్ట్రేషన్ చేసే ముందు క్షేత్రస్థాయిలో సర్వే చేసి నాలుగు దిక్కుల హద్దులు నిర్ణయించుకొని పట్టా పాస్ పుస్తకంలో భూమి వివరాలతో పాటు పటం ముద్రించడం జరుగుతుందన్నారు. తద్వారా భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండదన్నారు. రిజిస్ట్రేషన్ లో లేదా మ్యుటేషన్, సక్సెషన్ సమయంలో తప్పు జరిగిందని భావిస్తే ఆర్డీఓ కు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఆర్డీఓ స్థాయిలో కూడా తప్పు చేస్తే కలెక్టర్ కు అప్పీల్ చేసుకోవచ్చని తెలిపారు. పాస్ పుస్తకం తో పాటు ప్రతి భూకమతానికి ఒక భూధార్ కార్డు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
ఉద్దేశ్యపూర్వకంగా ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చి రిజిస్ట్రేషన్ లేదా మ్యుటేషన్ చేయించుకున్న లేదా అధికారులు తప్పు చేసిన అప్పీల్ చేసుకుంటే తప్పు చేసిన వారికి నోటీస్ ఇవ్వడం జరుగుతుందన్నారు. అధికారులు తప్పు చేస్తే చర్యలు తీసుకొని తప్పును సరి చేసే అవకాశం భూ భారతి చట్టంలో అవకాశం ఉందన్నారు.
ఇతరుల భూ రికార్డులు కావాలి అనుకుంటే తహసిల్దార్ సర్టిఫై తో వివరాలు తీసుకునే అవకాశం ఉందన్నారు.
ఒక కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉండి తండ్రి చనిపోతే ఇద్దరు స్లాట్ బుక్ చేసుకొని ఇద్దరమే హక్కుదారులమి అన్యాయంగా మ్యుటేషన్ చేయించుకుంటే ఇంతకు ముందు చట్టంలో తప్పు సరిదిద్దుకోవడానికి వీలు లేకుండా పోయిందన్నారు. భూ భారతి చట్టంలో నోటీస్ ఇచ్చి సరిదిద్దుకునే అవకాశం ఉందన్నారు.
పెండింగ్ లో ఉన్న సాదా బైనామా కేసులను సైతం ఆర్డీఓ క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కరించుకునే అవకాశం భూ భారతి చట్టంలో కల్పించిందన్నారు. అందుకే భూ భారతి చట్టం పై ప్రజలు క్షుణ్ణంగా తెలుసుకోవాలని అందుకే చట్టం గురించి కరపత్రాలు పంచడం జరుగుతుందన్నారు.
భూ భారతి చట్టం గురించి అదనపు కలెక్టర్ రెవెన్యూ జి. వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సుబ్రమణ్యం ప్రజలకు క్షుణ్ణంగా అవగాహన కల్పించారు.
కొత్తకోట తహసీల్దార్ వెంకటేశ్వర్లు, మదనపూర్ తహసీల్దార్ అబ్రహాం లింకన్, కొత్తకోట మార్కెట్ యార్డు చైర్మన్ ప్రశాంత్, వైస్ చైర్మన్, కిసాన్ సెల్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు రైతులు, ప్రజలు పాల్గొన్నారు.