
రాయితీలు, యంత్ర పరికరాలు, ఎరువులు, విత్తనాలు రైతులకు సకాలంలో అందించండి : మాజీమంత్రి ప్రత్తిపాటి
- సాగుకి ముందే భూసార పరీక్షలు పూర్తిచేసి, రైతులకు కార్డులు అందించండి : ప్రత్తిపాటి. వేసవిలో అపరాల సాగు ప్రోత్సహించి ఉత్పత్తులకు గిట్టుబాటుధర అందించండి : ప్రత్తిపాటి.
- స్థానిక వ్యవసాయసిబ్బందితో సమీక్ష నిర్వహించిన మాజీమంత్రి
ఖరీఫ్ సాగు ప్రారంభమయ్యేలోపు భూసారపరీక్షలు పూర్తిచేసి, భూములకు సంబంధించిన పూర్తిసమాచారంతో రైతాంగానికి కార్డులు అందించాలని, వేసవిలో ఉద్యానపంటలు, అపరాల సాగును ప్రోత్సహించాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు వ్యవసాయ సిబ్బందికి సూచించారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ వ్యవసాయ శాఖాధికారులు, రైతుసేవా కేంద్రాల సిబ్బందితో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. కూటమిప్రభుత్వం వచ్చినప్పటినుంచి రైతులకు ప్రభుత్వపరంగా అందిన సబ్సిడీలు, వ్యవసాయ పరికరాలు, యంత్రసామగ్రి, ఇతరత్రా సాయానికి సంబంధించిన వివరాలపై మాజీమంత్రి సిబ్బందిని ప్రశ్నించారు. అన్నిగ్రామాల్లో భూసార పరీక్షలు పూర్తిచేసి, సేంద్రియ వ్యవసాయానికి అనువైన నేలల్లో జీరో ఫార్మింగ్ ను ప్రోత్సహించాలని ప్రత్తిపాటి తెలిపారు. ప్రభుత్వం నుంచి అందే యాంత్రీకరణ పరికరాలు, వివిధరకాల పనిముట్లు, తైవాన్ స్ప్రేయర్ల కోసం రైతులు అందించిన దరఖాస్తులన్నీ వెంటనే క్లియర్ చేయాలని, అర్హత ఉన్న ప్రతి రైతుకు తాను కోరినవి అందేలా చూడాలని ప్రత్తిపాటి ఆదేశించారు. ఇప్పటికే ఎక్కువ మంది రైతులకు యంత్రసామగ్రి, ఇతర పరికరాలు అందించినట్టు వ్యవసాయ సిబ్బంది ప్రత్తిపాటికి తెలిపారు. సీసీఐ కేంద్రాల ద్వారా జరిగే పత్తికొనుగోళ్లు పంటపూర్తయ్యేవరకు కొనసాగేలా చూడాలని, ఏ ఒక్కరైతువద్ద పత్తినిల్వలు లేకుండా గిట్టుబాటు ధరకు కొనాలని మాజీమంత్రి చెప్పారు. వాణిజ్యపంటలు వేసే రైతులు ఎక్కువ పెట్టుబడులతో నష్టపోతున్నారని, ఖర్చుతగ్గించేలా వారిని చైతన్యపరచాలన్నారు.
మిరప, పొగాకు ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా వ్యవసాయశాఖ ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని, రైతులకు నష్టం లేకుండా అన్నిచర్యలు చేపట్టాల్సిన బాధ్యత వ్యవసాయ సిబ్బందిపై ఉందని ప్రత్తిపాటి తెలిపారు. వాణిజ్యపంటల సాగు నుంచి రైతుల్ని తక్కువఖర్చుతో ఎక్కువ దిగుబడి అందించే పంటలవైపు మళ్లించాలన్నారు. ఈ క్రాప్ నమోదు సకాలంలో పూర్తిచేయాలని, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యల్ని సిబ్బంది తమ అనుభవం, పనితీరుదో అధిగమించాలని మాజీమంత్రి సూచించారు. సబ్సిడీ విత్తనాలు, ఎరువులు తక్షణమే సిద్దం చేసుకోవాలని, వర్షాలు మొదలయ్యాక రైతాంగానికి అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. నర్సరీల ఏర్పాటుపై రైతులకు అవగాహన కల్పించాలని, నియోజకవర్గంలోని కొన్నిగ్రామాల్లో ఉన్న సారవంతమైన భూముల్ని అందుకు వినియోగించాలని ప్రత్తిపాటి వ్యవసాయ సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో జనసేన ఇన్చార్జి తోట రాజారమేష్, బీజేపీ నాయకులు జయరామిరెడ్డి, టీడీపీ నాయకులు నెల్లూరి సదాశివరావు, బండారుపల్లి సత్యనారాయణ, జవ్వాజి మధన్ మోహన్, కామినేని సాయిబాబు, గట్టినేని రమేష్ , తుపాకుల అప్పారావు, ఏవో లు, అధికారులు పాల్గొన్నారు.
