
పారిశుధ్య కార్మికుల సేవలను ఆకాశానికి ఎత్తేయడం కాదు…!
వారి కష్టాలు పట్టించుకోండి…
వారి బాధలను ఆలకించండి..
మరమత్తులకు గురైన పుష్‌క్యాట్‌లు..
పట్టించుకోని అధికారులు..
చెత్త సేకరణే ఇక్కడ పెద్ద సమస్య.
చిలకలూరిపేట:అందరూ వీరిని పొగిడేవారే. వీరు చేస్తున్న పనిని ప్రశంసిస్తూ ఆకాశానికి ఎత్తేవారే. కాని వారి కష్టాల గురించి ఎవరికీ సానుభూతి ఉండదు. వారి పరిస్థితులను మెరుగు పరుద్దామన్నా ఆలోచన ఉండదు. వ్యాధులొస్తే వైద్యులు రక్షిస్తారు. అసలు రోగాలు వ్యాప్తి చెందకుండా సమాజాన్ని కాపాడే ప్రయత్నం చేసేవారిలో పారిశుద్ధ్య కార్మికులు ముందువరుసలో నిలుస్తారు. ప్రజారోగ్యంలో కీలక పాత్ర పోషించే పారిశుధ్య కార్మికుల కష్టాలపై కనీస శ్రద్ధ చూపడంలేదు. వేరు వేరు అడంబరాలకు ప్రజా ధనాన్ని లక్షలు వెచ్చేంచే అధికారులు పారిశుధ్య కార్మికులు అనునిత్యం పనిచేసే పుష్‌క్యాట్లు గత రెండు సంవత్సరాల కాలం నుంచి పుష్‌క్యాట్లు మరమత్తులకు గురయ్యాయని,కొత్తవి కొనుగోలు చేయాలని మున్సిపల్ కార్మిక సంఘ నాయకులు అప్పట్లో అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. అదిగో.. కొనుగోలు చేస్తున్నాం.. ఇదిగో కొనుగోలు చేస్తున్నాం.. అంటూ ఇలాగే నెట్టుకువచ్చారు.
పెరిగిన పని ఒత్తిడి….
చిలకలూరిపేట పట్టణంలో జనభా పెరిగింది. పట్టణం వేగంగా విస్తరించింది. కొత్త కొత్త నిర్మాణలు వెలిశాయి. రోజుకు 34 వార్డుల పరిధిలోనే తీసుకుంటే సుమారు 35 టన్నుల చెత్త వెలువడుతుంది. అయినా 20 ఏళ్ల కిందట ఉన్నంతమంది కార్మికులే ఇప్పటికీ పని చేస్తున్నారు. ఒక్కో వీధిలో కాల్వలను శుభ్రం చేయడానికి ఇద్దరు, వ్యర్థాలను ఎత్తడానికి ఇద్దరు, ఊడ్చడానికి ఇద్దరు చొప్పున ఆరుగురు, వార్డులోని మూడు వీధులకు కలిపి 18 మంది అవసరం అవుతారు. అయితే ఇప్పుడు ముగ్గురు నలుగురుకు మించి కేటాయించడం లేదు. ప్రతి 10 వేల మంది జనాభాకు 28 పారిశుద్ధ్య కార్మికులు ఉండాలన్నది నిబంధన. కానీ క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే అరకొర సిబ్బంది.. వారూ ప్రైవేటు కూలీలే కావడం గమనార్హం. పట్టణంలో 700 మంది పారిశుధ్య కార్మికులు అవసరమవుతారనేది అంచనా కాగా ప్రస్తుతం 305 మంది ఉన్నారు.వీరిలో 38 మందే శాశ్వత కార్మికులు.. ఇంతటి తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్న కార్మికులకు చెత్త సేకరించి,వాటిని తరలించే పుష్‌క్యాట్‌లు సక్రమంగా లేకపోవడం విశేషం.
క్షేత్రస్థాయిలో కార్మికుల కష్టాలను పరిశీలించండి..
అధికారులు,క్షేత్రస్థాయిలో వెళ్లి కార్మికులు అనుభవిస్తున్న కష్టాలను పరిశీలిస్తే వారి బాధలు అర్థమవుతాయి. ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను మరమత్తులకు గురై కదలనని, మెరాయిస్తున్న పుష్‌క్యాట్‌లతో తోసుకుంటూ వెళ్లడం ఎంతటి కష్టతరము,ఎంత ఇబ్బందో పాలకులు దృష్టి సారించాలి. తప్పని సరి పరిస్థితుల్లో వాటిని మేస్త్రులు, కార్మికులు సొంత నిధులు వెచ్చించి మరమత్తులు చేసుకోవడం అదనపు భారంగా మారుతుంది. మరోవైపు
కార్మికులకు రక్షణ పరికరాలైన మాస్కులు, గ్లౌజులు, కొబ్బరినూనె, చెప్పులు, యూనిఫాం వంటివి ఎప్పుడు ఇస్తారో.. ఎవరికి తెలియని బ్రహ్మ రహాస్యం. మరోవైపు పుష్‌క్యాట్‌లలో ఉండే డస్టు బిన్‌లు లేకపోవడంతో చెత్త నిల్వ చేసే కేంద్రాల్లో వేసినప్పుడు ట్రాక్టర్ వచ్చి చెత్త సేకరించే వరకు వ్యర్ధాలు చుట్టు పక్కల పరిసరాల్లో పోగవడం వివాదాలకు దారి తీస్తుంది.ఇప్పటికైనా అధికారులు, పాలకులు పారిశుధ్య కార్మికుల కష్టాలపై దృష్టి సారించి పరిష్కరించాలని కోరుతున్నారు.
కమిషనర్ పి శ్రీహరిబాబు వివరణ
దీనిపై మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరి బాబు వివరణ కోరగా మూడుసార్లు టెండర్లు పిలవడం జరిగిందని ఎవరూ రాలేదని, మరోసారి టెండర్ పిలుస్తామని తెలిపారు.
