
ప్రభుత్వ ఆర్థికసాయం పేదల ప్రాణాలు నిలబెడుతోంది: మాజీమంత్రి ప్రత్తిపాటి
- ఖరీదైన వైద్యసేవలు పొందలేని పేద, మధ్యతరగతి వర్గాలను సీఎం.ఆర్.ఎఫ్ సాయం ఆదుకుంటోంది : ప్రత్తిపాటి.
అత్యవసర వైద్య చికిత్సల నిమిత్తం ప్రభుత్వం అందించే ఆర్థికసాయం పేదల ప్రాణాలు నిలుపుతోందని, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఖరీదైన వైద్యసేవలు పొందలేని పేద, మధ్యతరగతి కుటుంబాల వారిని ముఖ్యమంత్రి సహాయ నిధి ఆదుకుంటోందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన పలువురు పేదలకు ప్రభుత్వం మంజూరు చేసిన సీ.ఎం.ఆర్.ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. 25 మంది లబ్ధిదారులకు రూ.34.92లక్షల విలువైన చెక్కులను, ముందస్తు వైద్యసేవలకు అవసరమైన రూ.5లక్షల ఎల్.వో.సీని ప్రత్తిపాటి లబ్ధిదారులకు అందించారు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి మెరుగైన వైద్యం అందించి వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాద్యత కుటుంబసభ్యులపైనే ఉందని మాజీమంత్రి సూచించారు..
పేదల ప్రాణాలు నిలబెట్టే ముఖ్యమంత్రి సహాయ నిధి పంపిణీని గత ప్రభుత్వం నిలిపివేసిందని, దాంతో లక్షలాది పేద, మధ్యతరగతి కుటుంబాలవారు మెరుగైన వైద్యసేవలు పొందలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ప్రత్తిపాటి తెలిపారు. ప్రజల ప్రాణాలు కాపాడాలన్న సదుద్దేశంతోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం.ఆర్.ఎఫ్ పంపిణీని పునరుద్ధరించిందన్నారు. నియోజకవర్గంలో ఎవరూ అనారోగ్య సమస్యలతో బాధపడకూడదని, అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సీఎం.ఆర్.ఎఫ్ సాయం అందేలా చూస్తామని ప్రత్తిపాటి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నెల్లూరి సదాశివరావు, షేక్ టీడీపీ కరీముల్లా, జవ్వాజి మధన్ మోహన్, కామినేని సాయిబాబు, పఠాన్ సమాధ్ ఖాన్, మద్దుమలా రవి, గంగా శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు, తదితరులున్నారు.
