TEJA NEWS

ముగిసిన అఖిలపక్ష సమావేశం….ప్రధాని మోదీ కీలక సందేశం

ప్రధాని నరేంద్ర మోదీ అఖిల పక్ష సమావేశంలో ఆపరేషన్ సిందూర్పై కీలక సందేశం ఇచ్చినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్తో పోరులో ప్రతిపక్షాలు తమతో కలిసి నడవాలని ఆయన విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. గురువారం జరిగిన సమావేశం సందర్భంగా ప్రతిపక్ష పార్టీలు ఆపరేషన్ సిందూర్‌పై ప్రశంసలు కురిపించాయి. భారత సైన్యం పాకిస్తాన్‌లోకి చొచ్చుకెళ్లి మరీ ఉగ్రవాదుల స్థావరాలను కూల్చడంపై హర్షం వ్యక్తం చేశాయి.

100 మంది టెర్రరిస్టుల హతం

ఆపరేషన్ సిందూర్‌ గురించి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక విషయాలు వెల్లడించారు. నిన్న పాకిస్తాన్‌లోని 9 ఉగ్రవాదుల స్థావరాలపై జరిగిన దాడుల్లో .. 100 మంది దాకా ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలిపారు. ఏప్రిల్ 22 పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా ఈ దాడులు జరిగినట్లు పేర్కొన్నారు. కాగా.. మంగళవారం అర్థరాత్రి 1.05 గంటలకు ఆపరేషన్ మొదలైంది. మొత్తం 9 ఉగ్రవాదుల స్థావరాలపై మిస్సైళ్ల వర్షం కురిసింది. 25 నిమిషాల్లో ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది.

సమావేశంలో పాల్గొన్న వారు వీరే..

రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హోం శాఖ మంత్రి అమిత్ షా, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్, మంత్రులు జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఇక, కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే వచ్చారు. త్రిణముల్ కాంగ్రెస్ నుంచి సందీప్ బందోపాధ్యాయ.. డీఎంకే నుంచి టీఆర్ బాలు.. సమాజ్ వాదీ పార్టీ నుంచి రామ్ గోపాల్ యాదవ్.. ఆప్ నుంచి సంజయ్ సింగ్.. శివ సేన నుంచి(యూబీటీ) సంజయ్ రౌత్ తదితర పార్టీల వారు హాజరయ్యారు.