
సరిహద్దు పోస్టుల వద్ద పాక్ సైన్యం కాల్పులు..
న్యూఢిల్లీ: ఇంత జరిగినా పాకిస్తాన్ ఉల్లంఘనలకు పాల్పడుతోంది. నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల ఉల్లంఘన కొనసాగుతోంది. కుప్వారా, బారాముల్లా, ఉరి అక్నూర్ (Aknur) సరిహద్దు పోస్టుల వద్ద పాక్ సైన్యం కాల్పులకు దిగింది. చిన్న ఆయుధాలు, ఆర్టిలరీ గన్స్‌తో కాల్పులు జరిపింది. పాకిస్థాన్ కవ్వింపు చర్యలను భారత సైన్యం తిప్పికొట్టింది. కాగా పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో గట్టిగా బదులిచ్చింది. దీంతో కడుపుమంటతో రగిలిపోతున్న పాక్ ఆర్మీ సరిహద్దు ప్రాంతాల ప్రజలపై తమ ప్రతాపం చూపిస్తోంది. కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్ఓసి) వెంబడి పాకిస్తాన్ దళాలు బుధవారం అర్ధరాత్రి వరుసగా కాల్పులకు తెగబడ్డాయి. దీంతో సరిహద్దు గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు.
బోర్డర్ ప్రాంతాలే లక్ష్యం…
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి బోర్డర్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న పాక్ సైన్యం.. గ్యాప్ లేకుండా కాల్పులకు తెగబడుతూనే ఉంది. బుధవారం అర్ధరాత్రి తర్వాత కర్నా సెక్టార్‌లోని పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ కాల్పులు జరిపిందని, షెల్లు, మోర్టార్లను ప్రయోగించిందని, విచక్షణారహితంగా కాల్పులు జరిపిందని అధికారులు తెలిపారు. పాకిస్తాన్ కాల్పులకు భారత సాయుధ దళాలు సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి.
ముష్కరుల కోసం వేట..
మరోవైపు జమ్మూకశ్మీర్‌లో ముష్కరుల కోసం వేట కొనసాగుతోంది. ఉగ్రవాదుల కోసం భద్రతా సిబ్బంది, పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ మేరకు అనుమానితుల నివాసాల్లో పోలీసులు ముమ్మరంగా సోదాలు నిర్వహించారు. పహల్గాం దాడి అనంతరం ఇప్పటివరకు 100కు పైగా అనుమానిత ఉగ్రవాదులు, వారి అనుచరుల ఇళ్లల్లో తనిఖీలు చేసినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం ఒక్కరోజే 30కి పైగా ప్రాంతాల్లో సోదాలు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
అయితే సరిహద్దు కాల్పులకు సైన్యం వేగంగా స్పందించిందని, కుప్వారా రాజౌరి-పూంచ్ సెక్టార్లలోని పాకిస్తాన్ ఆర్మీ పోస్టులపై దాడి చేయగా గణనీయమైన నష్టం వాటిల్లిందని రక్షణ వర్గాలు తెలిపాయి. పాక్ దాడుల వల్ల స్థానిక నివాసితుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కొందరు బంకర్లలో ఆశ్రయం పొందగా మరికొందరు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లినట్టు పలు కథనాలు వెల్లడించాయి. ఈ కాల్పులు పూంచ్ సెక్టార్ కు మాత్రమే పరిమితమయ్యాయని ప్రాణ నష్టం సైతం అక్కడే ఎక్కువగా సంబంధించిందని తెలిపాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దు జిల్లాల్లో విద్యాసంస్థలను ప్రభుత్వం మూసివేసింది.
