
ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. ఏపీ వాసులు ఇద్దరు మృతి …ఇద్దరు టీడీపీ ఎంపీ కుటుంబ సభ్యులు..విషాదంలో ఎంపీ కుటుంబం
ఉత్తరాఖండ్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఉత్తరకాశీలో గంగోత్రి వైపు పర్యాటకులతో వెళ్తున్న ప్రైవేట్ హెలికాప్టర్ కుప్పకూలి ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో అనంతపురం టీడీపీ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆయన సోదరి వేదవతి కుమారి మృతి చెందగా, బావ భాస్కర్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు, విచారణకు ఆదేశించారు.
ఈ ప్రవైవేట్ హెలికాప్టర్ ఉత్తరకాశీలో గంగోత్రి వైపు వెళ్తుండగా ఇవాళ ఉదయం 9 గంటల ప్రాంతంలో.. ఏం జరిగిందో తెలియదు కానీ.. గంగ్నాని ప్రాంతం సమీపంలో ఒక్కసారిగా హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స అందిస్తున్నారు. పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
