
ఆంధ్ర ప్రదేశ్ పశువైద్య విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సబ్సిడీ పశుగ్రాసా పంపిణీని ప్రారంభించిన ప్రత్తిపాటి
రైతులకు ఇచ్చే ప్రోత్సాహకాలని సబ్సిడీ లని సద్వినియోగం చేసుకోవాలని కోరారు
గత పాలకుల పాపాలు సరిచేస్తూనే, ముఖ్యమంత్రి ప్రజలకోసం కష్టపడుతున్నారు: మాజీమంత్రి ప్రత్తిపాటి
మరలా జగన్ ప్రభుత్వం వచ్చి ఉంటే ప్రజలు ఆస్తులు, భూములు కోల్పోయేవారు : ప్రత్తిపాటి.
- నెలరోజుల వ్యవధిలోనే తల్లికి వందనం, అన్నదాతాసుఖీభవ అమలు : ప్రత్తిపాటి
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వ శ్రమను దృష్టిలో పెట్టుకొని, అధికార యంత్రాంగం ఉన్నంతలో ప్రజలకు మంచి చేస్తోందని, కష్టాలు.. సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తూనే ప్రభుత్వ పథకాలు, విధానాలపై వివిధ శాఖల అధికారులు ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నారని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, అవినీతితో గాడితప్పిన రాష్ట్రాన్ని సక్రమమార్గంలో నడిపిస్తూనే, ప్రజలకు మెరుగైన సంక్షేమం అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతగానో కష్టపడుతున్నారనే వాస్తవాన్ని ప్రజలు గ్రహించాలని ప్రత్తిపాటి సూచించారు. మండలంలోని పసుమర్రు గ్రామంలో రాష్ట్ర పశువైద్యవిభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సబ్సిడీ పశుగ్రాస పంపిణీని ప్రత్తిపాటి గురువారం ప్రారంభించారు. ప్రభుత్వం పాడి పశువుల పెంపకానికి అందించే ప్రోత్సాహకాలు, సబ్సిడీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ప్రత్తిపాటి సూచించారు.
చంద్రబాబు కష్టాన్ని, ఆలోచనల్ని ప్రజలు గుర్తించాలి
నెలరోజుల వ్యవధిలోనే తల్లికి వందనం, అన్నదాతా సుఖీభవ పథకాలను కూటమిప్రభుత్వం ప్రారంభించబోతోందని ప్రత్తిపాటి తెలిపారు. సూపర్-6 అమల్లో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీని ఇప్పటికే అమలుచేయడం జరిగిందని, త్వరలోనే తల్లికి వందనం పథకం ఆచరణలో పెట్టనుందన్నారు. పోలవరం, అమరావతిని పూర్తిచేయడమే లక్ష్యంగా చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని, ఆయన ఆలోచనలు.. కష్టాన్ని ప్రజలు కూడా గుర్తించాలని ప్రత్తిపాటి సూచించారు.
విద్యాశాఖ మంత్రి లోకేశ్ విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు, మార్పులతో అంతిమంగా మేలే కలుగుతుంది తప్ప, ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రత్తిపాటి చెప్పారు. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలచేసి, ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నారన్నారు. గత పాలకులు చేసిన తప్పుల్ని సరిచేయడానికే కూటమిప్రభుత్వానికి ఎక్కువ సమయం పడుతోందని, ప్రజలు కూడా ఈ వాస్తవాన్ని గుర్తించాలన్నారు.
మరలా జగన్ ప్రభుత్వం వచ్చిఉంటే, ప్రజలు ఆస్తులు.. భూములు కోల్పోయేవారు
కూటమిప్రభుత్వంలో ప్రశాంతంగా, సంతోషంగా జీవిస్తున్నామనే నిజాన్ని ప్రతిఒక్కరూ గ్రహించాలని, మరలా జగన్ ప్రభుత్వం వచ్చి, ల్యాండ్ టైటిల్ యాక్ట్ అమలై ఉంటే ప్రజలు వారిభూములు, ఆస్తులు అన్నీ కోల్పోయి కట్టుబట్టలతో రాష్ట్రం విడిచి పోవాల్సివచ్చేదని ప్రత్తిపాటి తెలిపారు. రాత్రికి రాత్రే ఏమీ జరగడం లేదనే అసంతృప్తిని విడనాడి, చంద్రబాబు పాలనలో అందరం స్వేచ్ఛగా జీవిస్తున్నామనే నిజాన్ని తెలుసుకోవాలన్నారు. గత ప్రభుత్వం కొన్ని పంచాయతీలను ఇష్టానుసారం మున్సిపాలిటీల్లో కలిపిందని, ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా కోర్టుల నిబంధనలు కాదని ఇష్టమొచ్చినట్టు వ్యవహరించారని ప్రత్తిపాటి అసహనం వ్యక్తం చేశారు. బైపాస్ నిర్మాణానికి భూములిచ్చి తక్కువ నష్టపరిహారం పొందిన రైతులకు ప్రభుత్వం నుంచి త్వరలోనే న్యాయమైన పరిహారం అందుతుందని ప్రత్తిపాటి తెలిపారు. సమస్యను కలెక్టర్ ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని, రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా పశువైద్యాధికారులు కాంతారావు, ఏడి శ్రీనివాసరావు, రాధాకృష్ణ, ఎంపీడీవో శ్రీనివాసరావు మరియు సిబ్బంది, కూటమినేతలు నెల్లూరి సదాశివరావు , జవ్వాజి మధన్ మోహన్, భాషా, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
