TEJA NEWS

ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణ భేష్

  • తిరుపతిలో 16వ ఆర్థిక సంఘం సభ్యురాలు సౌమ్య
  • తిరుపతి: తిరుపతి రూరల్ రేణిగుంట మండలంలోని తూకివాకంలో తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ నిర్వహణ బాగుందని 16వ ఆర్థిక కమిషన్ సభ్యులు సౌమ్య కాంతి ఘోష్ అన్నారు.
  • ఉదయం తూకివాకంలో తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ (చెత్త నుండి సంపద కేంద్రం) ను జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, నగర పాలక సంస్థ కమిషనర్ మౌర్యతో కలసి 16వ ఆర్థిక కమిషన్ సభ్యులు సౌమ్యకాంతి ఘోష్, సెక్రటరీ గౌతమ్ అల్లాడలు పరిశీలించారు. ఈ ప్లాంట్ నందు ఘన వ్యర్థాల నిర్వహణ, తడి చెత్త నిర్వహణ కంపోస్టు, బయో మెథనైజేశన్ ప్లాంట్, భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ తదితర యూనిట్ల నిర్వహణ గురించి తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య పలు అంశాలు వివరించారు.

  • ఈ ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా నగరంలో ఏర్పడిన అన్ని రకాల చెత్తను, మురుగునీటిని నిర్వహణ చేసి సంపద సృష్టించే విధానం గురించి వివరించారు. తిరుపతి నగరంలో సేకరించిన తడి, పొడి చెత్త ద్వారా ఏర్పడిన పొడి చెత్త నిర్వహణ చేస్తారని, ఇందులో వచ్చిన ప్లాస్టిక్ వ్యర్థాలు తదితరాలను ప్రాసెసింగ్ చేసి సిమెంట్ ఫ్యాక్టరీలకు విక్రయిస్తారని, తడి చెత్తను నిర్వహణ చేసి కంపోస్టు ఎరువుగా మార్చి రైతులకు, ఉద్యానవనాలకు విక్రయిస్తారని, ఇక మార్కెట్ నుండి వెలువడే వ్యర్థాలు, హోటల్స్ నుండి సేకరించిన వ్యర్థాలను నిర్వహణ చేసి వంట గ్యాస్ ను ఉత్పత్తి చేసి విక్రయించడం జరుగుతుందని తెలిపారు. నగరంలో ప్రతిరోజూ ఉత్పతి అయ్యే సుమారు 25 టన్నుల భవన నిర్మాణ వ్యర్ధాలను నిర్వహణ చేసి ఆరు రకాలుగా గుల్ల, ఇసుకగా మారుస్తారని, ఇలా ఉత్పతి అయిన ఇసుక గుల్ల తో పేవర్స్ తయారు చేస్తారని తెలిపారు. ప్రతిరోజూ తడి చెత్త 150 టన్నులు, 75 టన్నులు పొడి చెత్త నిర్వహణ చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే ట్రీటెడ్ వేస్ట్ నీటిని పరిశ్రమలకు విక్రయించడం జరుగుతుందని తెలిపారు.
    ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, లైజన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.