TEJA NEWS

తిరుమ‌ల‌ శుభ్రతలో అందరూ భాగస్వామ్యం

** స్వ‌చ్ఛాంధ్ర కార్య‌క్ర‌మంలో టీటీడీ అద‌న‌పు ఈవో వెంక‌య్య చౌద‌రి

తిరుమ‌ల‌: ప్రపంచ స్థాయి హైందవ పుణ్యక్షేత్రం అయిన తిరుమలలో పరిశుభ్రతను పాటించడంలో అందరూ భాగస్వాములేనని టీటీడీ అద‌న‌పు ఈవో సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రి అన్నారు. స్వచ్ఛాంధ్ర మిష‌న్ లో భాగంగా తిరుమ‌ల‌లో స్ఛ‌చ్ఛాంధ్ర – స్వ‌చ్ఛ తిరుమ‌ల కార్య‌క్ర‌మాన్ని స్థానిక బాలాజీ న‌గ‌ర్ లో నిర్వ‌హించారు. ఈ కార్యక్ర‌మానికి విచ్చేసిన అద‌న‌పు ఈవో తిరుమ‌ల స్థానికుల‌కు పారిశుద్ధ్యం, ప‌రిశుభ్ర‌త‌పై అవ‌గాహ‌న క‌ల్పించి వారి చేత స్వ‌చ్ఛాంధ్ర ప్ర‌తిజ్ఞ చేయించారు. ఆయన మాట్లాడుతూ ప్ర‌తిరోజూ ల‌క్ష‌లాదిమంది విచ్చేసే తిరుమ‌ల క్షేత్రంలో ప‌రిశుభ్ర‌త కాపాడుకో వాల్సిన‌ బాధ్య‌త స్థానికుల‌పై ఉంద‌న్నారు. స్థానికులు వ్యాపారం చేసే క్ర‌మంలో స్వ‌చ్ఛ‌త‌కు తిలోద‌కాలు ఇవ్వ‌కుండా భ‌క్తుల‌కు ప‌రిశుభ్ర‌మైన ఆహారం అందిచాల‌న్నారు. వేస‌విలో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుని భ‌క్తుల‌కు దుకాణాల వ‌ద్ద విరివిగా మంచినీరు అందించి ప‌రోప‌కారం చేయాల‌న్నారు.


స్థానికులు ప‌రిస‌రాల ప‌ట్ల అవ‌గాహ‌న పెంచుకోవాల‌ని సూచించారు. టీటీడీ వ్య‌వ‌స్థ‌ను మ‌రింత బ‌లోపేతం చేయాలంటే స్థానికుల స‌హ‌కారం త‌ప్ప‌నిస‌రి అని తెలిపారు. స్థానికులంద‌రూ కూడా టీటీడీ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటిస్తూ స్వ‌చ్ఛ తిరుమ‌ల‌లో భాగ‌స్వామ్యం కావాల‌ని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో డిప్యూటీ ఈవోలు కస్తూరి బాయి, సోమ‌న్ నారాయ‌ణ‌, సీపీఆర్వో టి.ర‌వి, ఆరోగ్యాధికారి మ‌ధుసూద‌న్‌, వీజీవో సురేంద్ర‌, తిరుమల పీఆర్వో నీలిమ, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.