
మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం”….
సీసీసీ నస్పూర్‌లో నార్కోటిక్ డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల ఆకస్మిక తనిఖీలు…
పెద్దపల్లి జిల్లా ప్రతినిధి రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల నిర్మూలన, నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా గురువారం సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ ప్రశాంత్ ఆధ్వర్యంలో నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
పోలీస్ స్టేషన్ పరిధిలోని నస్పూర్ ప్రాంతంలో పలు దుకాణాలు, పాన్ షాపులు, టీ స్టాల్స్, యువత ఎక్కువగా గుమికూడే ప్రదేశాలు, ధూమపానం చేసే ప్రాంతాలు మరియు ఇతర అనుమానాస్పద ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
మాదక ద్రవ్యాల రవాణా, విక్రయం, నిల్వ, వినియోగం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్ఐ ప్రశాంత్ మాట్లాడుతూ, యువత మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడటమే లక్ష్యంగా నిరంతరం తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
గంజాయి, డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల రవాణా, విక్రయం, నిల్వ లేదా వినియోగానికి పాల్పడే వారిపై చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు అందించాలని, ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.
ఈ తనిఖీల్లో పోలీసు సిబ్బంది, నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు.