
విశాఖలో ఓ తండ్రి గుండెఘోష
కాలేజీ బస్సు ఢీకొని తనయుడు దుర్మరణం
విశాఖపట్నంలో కాలేజీ బస్సు ఢీకొని ఓ యువ ఇంజనీర్ దుర్మరణం స్థానికులను కలచి వేసింది. ఓ తండ్రి గుండెఘోష అందరినీ కంటతడి పెట్టించింది. కూలీనాలీ వడ్రంగి మేస్త్రిగా తన ఇద్దరు కొడుకులకు ఉజ్వల భవిష్యత్తును అందించిన ఈ తండ్రి గుండెను కుదిపేసిన ఈ దుర్ఘటన విశాఖపట్నం నగర పరిధిలోని గోపాలపట్నంలో గురువారం ఉదయం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తపాలెం ఆదర్శనగర్ కు చెందిన ఉమ్మి ఆదినారాయణ ఓ కార్పెంటర్. ఆయనకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు వేణుగోపాలరావు, ఇంజనీరింగ్ చదివాడు. డబ్ల్యూఎన్ఎస్ కంపెనీలో సత్యం కంప్యూటర్స్ లో ఉద్యోగం చేస్తున్నాడు. రెండవ కుమారుడు వెంకట బాలాజీ (26) ఇంజనీరింగ్ పూర్తిచేసి షిప్ యార్డ్ లో అప్రెంటీస్ గా పనిచేస్తున్నాడు.
శుక్రవారం ఉదయం తన సోదరుడు వేణుగోపాలరావును ఆఫీసులో దించటానికి బయలు దేరిన బాలాజీని గోపాలపట్నంలో లక్కీ షాపింగ్ మాల్ వద్ద రఘు ఇంజనీరింగ్ కాలేజీ బస్సు రూపంలో మృత్యువు కాటేసింది. అన్నదమ్ముల బైక్ ను బస్సు ఢీకొనటంతో బాలాజీ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ సమాచారంతో కుటుంబ సభ్యులు ప్రమాద స్థలికి చేరుకుని బోరును విలపించారు. తన చిన్న కుమారుడు చనిపోవడంతో తండ్రి ఆదినారాయణ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఎంతో కష్టపడి వడ్రంగి పనులు చేస్తూ తన కుమారులను ఉన్నత చదువులతో తీర్చిదిద్దితే విధి తనను కాటేసిందని కన్నీరు మున్నీరుగా రోదించాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కుమారుడు విగతజీవిగా మారటాన్ని తట్టుకోలేకపోయాడు. ప్రమాద స్థలికి ట్రాఫిక్ సీ ఐ శ్రీనివాసరావు, ఎస్ ఐ ఎస్ ఐ అప్పల నాయుడు చేరుకున్నారు. రఘు ఇంజనీరింగ్ కాలేజీ బస్సును అదుపులోకి తీసుకున్నారు.
