TEJA NEWS

తిరుమలలో భద్రతపై ఉన్న‌తస్థాయి సమీక్ష

తిరుపతి : తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో తిరుమ‌ల భద్రత‌పై ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పోలీసు శాఖ, టీటీడీ, ఇతర భద్రతా విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతపురం రేంజ్ డీఐజీ డా.షెమూషి అధ్యక్షతన ఈ సమావేశం జ‌రిగింది.
ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ, ఇటీవల పహల్గాం ఉగ్ర దాడి ఘటన నేపథ్యంలో తిరుమల ఆలయంలో భద్రతను మరింత బలోపేతం చేయడమే భద్రతా ఆడిట్ ఉద్దేశ్యం అని పేర్కొన్నారు. అన్ని భద్రతా దళాలు మరియు టీటీడీ విభాగాల సమన్వయంతో పనిచేస్తూ, భక్తుల మ‌నోభావాలను కాపాడట‌మే ప్రధాన లక్ష్యంగా ఉండాలన్నారు.
అంతకు ముందు టీటీడీ ఇన్‌ఛార్జి సీవీఎస్వో అండ్ తిరుపతి అర్బన్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు 2023 మే నెలలో నిర్వహించిన భద్రతా ఆడిట్ సమీక్షలో చేసిన ప్రతిపాదనలు, అలాగే ఇటీవల ఏర్పడిన పరిస్థితుల ఆధారంగా చేపట్టాల్సిన మార్పులు అనే విషయాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సుదీర్ఘoగా వివరించారు. అలాగే ఏపీఎస్పీ, డీఏఆర్, ఎస్పీఎఫ్, హోం గార్డులు, సివిల్ పోలీసు, టీటీడీ భద్రతా సిబ్బంది వంటి అన్ని భద్రతా దళాలను సమన్వయ పరచి ప్రతి ఒక్క దళానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది సహా అన్ని యాక్సెస్ కంట్రోల్ బృందాలకు తగిన శిక్షణ ఇవ్వాల్సిన అవసరముందని అన్నారు.
తలకోన, మామండూరు, తుంబురు తీర్థం, మంగళం మార్గాలు సహా శేషాచల అటవీ ప్రాంతానికి చెందిన 14 ప్రవేశ ద్వారాలలో భద్రతను మరింత పటిష్టం చేయాలని సూచించారు. భద్రతా సిబ్బందికి రసాయన, జీవ, కిరణ, అణు ముప్పులపై శిక్షణ, యాంటీ సాబటేజ్ చ‌ర్య‌లు, మాక్ డ్రిల్లులు, ఎవాక్యుయేషన్ డ్రిల్లులు వంటి అంశాలపై శిక్షణలు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో గ్రేహౌండ్స్ (కమాండర్) ఎస్పీ డా. గరుడ్ సుమిత్ సునీల్, ఐఎస్‌డ‌బ్ల్యూ ఎస్పీ అరిఫ్ హఫీజ్, తిరుపతి డీఎఫ్ఓ వివేక్ ఆనంద్, వివిధ భద్రతా దళ అధికారులు, టీటీడీ విజిలెన్స్‌, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.