
జపాన్ షిటో ర్యూ కరాటే స్కూల్‌కు చెందిన 25 మంది విద్యార్థులకు అరుదైన ఘనత…
కరాటేతో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని సీపీ సూచన….
పెద్దపల్లి జిల్లా ప్రతినిధి రామగుండం, హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఏప్రిల్ 26న నిర్వహించిన లార్జెస్ట్ కరాటే గిన్నిస్ వరల్డ్ రికార్డు కార్యక్రమంలో రామగుండం విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి 2,900 మంది విద్యార్థులు, సీనియర్ కరాటే మాస్టర్లు పాల్గొనగా, వారిలో 1,212 మంది గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు.
ఈ ప్రతిష్ఠాత్మక విజయాల్లో పెద్దపల్లి జిల్లా రామగుండానికి చెందిన జపాన్ షిటో ర్యూ కరాటే స్కూల్ విద్యార్థులు 25 మంది గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించి పట్టణానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు.
గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన విద్యార్థులను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రత్యేకంగా అభినందించి, సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేసి ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరాటే కేవలం ఒక క్రీడ మాత్రమే కాదని, జీవితంలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, మానసిక ధైర్యం, శారీరక దృఢత్వాన్ని పెంపొందించే గొప్ప మార్షల్ ఆర్ట్ అని పేర్కొన్నారు. ముఖ్యంగా బాలికలు స్వీయరక్షణ కోసం కరాటేను తప్పనిసరిగా నేర్చుకోవాలని సూచించారు.
విద్యార్థులు క్రీడలతో పాటు విద్యలోనూ రాణిస్తూ దేశానికి మంచి పేరు తీసుకురావాలని, భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి మరిన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డులు నెలకొల్పాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జపాన్ షిటో ర్యూ కరాటే స్కూల్ తెలంగాణ రాష్ట్ర చీఫ్ అండ్ బెల్ట్ ఎగ్జామినర్ కరాటే శ్రీనివాస్ పాల్గొనగా, ఆయన శిక్షణలోనే విద్యార్థులు ఈ ఘనత సాధించడం పట్ల రాష్ట్ర అధ్యక్షుడు ఎం. రమేష్, సీనియర్ ఇన్‌స్ట్రక్టర్లు ఎస్. శ్రీనివాస్, శ్రావణ్ పటేల్, సంజన, అభిజ్ఞ, ఎన్టీపీసీ స్పోర్ట్స్ కౌన్సిల్ కార్యదర్శి శ్రీరామ్, స్పందన క్లబ్ కార్యదర్శి డాక్టర్ కె. నరేంద్ర సోనీ, చిరంజీవి ఆదిత్య, స్వామి, గణేష్ రాజ్‌తో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.