
ఘనంగా ఆదిశంకరాచార్య రామానుజాచార్య జయంతి వేడుకలు
సూర్యపేట జిల్లా : అద్వైత, విశిష్టాద్వైతాలను బోధించి సనాతన ధర్మాన్ని ఉద్ధరించిన అవతార పురుషులు జగద్గురు ఆదిశంకరాచార్యులు, భగవద్ రామానుజాచార్య జయంతి వేడుకలను సూర్యాపేట జిల్లా కేంద్రంలోని భగవద్గీత మందిరంలో ఘనంగా నిర్వహించారు. దేవాలయాలు, ధార్మిక సంస్థల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గత వారం రోజులుగా జరుగుతున్న బాలల ఆధ్యాత్మిక శిక్షణా తరగతులలో భాగంగా ఈ వేడుకలను నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు, ఆనంద శర్మలు ప్రసంగిస్తూ సనాతన ధర్మానికి విఘాతం కలుగుతూ , అంధ విశ్వాసాలు, అసమానతలు ప్రబలుతున్న వేళ సనాతన ధర్మాన్ని పరిరక్షించి సమాజంలో భక్తి ప్రపత్తులను పెంపొందించి, సమైక్యతను, సమరసతను చాటిన మహాపురుషులు ఆదిశంకరాచార్య, భగవద్ రామానుజాచార్యులు అని కొనియాడారు. ఈ సందర్భంగా శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయ ప్రధాన అర్చకులు మురళీధరాచార్యులు విద్యార్థులందరికీ భగవద్గీత గ్రంథాలను కానుకలుగా అందించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ తరగతుల కన్వీనర్లు నాగవెల్లి ప్రభాకర్, పర్వతం శ్రీధర్ ,దేవులపల్లి ప్రశాంతి, భాను ప్రసాద్, ఉప్పలయ్య ,శ్రీరంగం రాము, విద్యార్థులు,తల్లి తండ్రులు తదితరులు పాల్గొన్నారు.
