Spread the love

అగ్రిగోల్డ్ బాధితుల కన్నీటి పాదయాత్రను జ‌య‌ప్ర‌దం చేయాలి

అగ్రిగోల్డ్ బాధితుల‌కు న్యాయం చేయాలి

చిల‌క‌లూరిపేట‌:ఈ నెల 19న విజయవాడలో జరిగే అగ్రిగోల్డ్ బాధితుల కన్నీటి పాదయాత్రను జయప్రదం చేయాలని సీపీఐ ప‌ట్ట‌ణ కార్య‌ద‌ర్శి పేలూరి రామారావు కోరారు. ప‌ట్ట‌ణంలోని సీపీఐ కార్యాలంలో అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్ నాయ‌కుల‌తో క‌ల‌సి విలేక‌ర్ల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ అగ్రిగోల్డ్‌ ఆర్థిక మోసాలకు పాల్పడి పదేళ్ల తొమ్మిది నెలలు గడిచినా బాధితులకు న్యాయం చేయ‌డంలో ప్ర‌భుత్వాలు విఫ‌ల‌మ‌య్యాయ‌ని ఆరోపించారు. గత ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకుండా అలసత్వం వహిస్తున్నారని ధ్వజమెత్తారు.కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలైనా అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేలా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు.
సీపీఐ మాజీ ఏరియా కార్య‌ద‌ర్శి నాగ‌బైరు సుబ్బాయ‌మ్మ మాట్లాడుతూ సత్వర న్యాయ పరిష్కారం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. ప‌లు జిల్లాల‌లో కొట్లాదిగా అగ్రిగోల్డ్‌ ఆస్తులను కొల్లగొట్టడంతో బాధితుల్లో మరోసారి భయాందోళనలు నెలకొన్నాయన్నారు. కూటమి పాలకులపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బాధితులకు నిరాశే మిగిలిందన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం స్పందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేకుంటే భవిష్యత్‌లో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్య‌క్ర‌మంలో, నాయ‌కులు త‌న్నీరు వెంక‌టేశ్వ‌ర్లు, ఆరాధ్యుల రామ‌కృష్ణ‌, అసోసియేష‌న్ నాయ‌కులు హ‌నుమంత‌రావు, బ్ర‌హ్మ‌య్య త‌దిత‌రులు పాల్గొన్నారు.