
ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యతో పాటు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచాలి……….. జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి
వనపర్తి
ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి నాగవరం శివారులోని కేంద్ర విద్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలోని తరగతి గదులు, విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు, మౌలిక వసతులను పరిశీలించారు. పాఠశాలలో ఫర్నిచర్, ఇతర అవసరాలపై ప్రిన్సిపాల్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అదనపు సౌకర్యాలు లేదా అవసరాలు ఉంటే జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) ద్వారా ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల సిబ్బందికి సూచించారు.
కేజీబీవీ లో డిజిటల్ తరగతి గది పరిశీలన
మర్రికుంట లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి అక్కడ హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల (రూ. 9 లక్షల) ద్వారా ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి గదిని పరిశీలించారు. త్వరలోనే ఈ డిజిటల్ క్లాస్ రూమ్ ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంకు సహకారంతో మొత్తం 16 డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
అదేవిధంగా ప్రభుత్వం విద్యార్థులకు పంపిణీ చేయడానికి సరఫరా చేసిన పాఠ్యపుస్తకాలను పరిశీలించారు. పుస్తకాల పంపిణీ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి ప్రతి విద్యార్థికి సమయానికి అందేలా చూడాలని సిబ్బందికి ఆదేశించారు.
ఇంటర్మీడియట్ విద్యార్థుల అభ్యాసాన్ని మరింత మెరుగుపరిచేందుకు ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా వంటి డిజిటల్ విద్యా వేదికలను సమర్థవంతంగా వినియోగించాలని ఉపాధ్యాయులు, సిబ్బందికి సూచించారు. ఈ వనరులను ఉపయోగించడం ద్వారా విద్యార్థులు ఆయా సబ్జెక్టుల్లో మెరుగైన అవగాహనతో పాటు మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు.
జిల్లాలో విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి, నాణ్యమైన విద్య అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు.
జెడ్పి సీఈవో యాదయ్య, ఎల్ డి ఎం శివకుమార్, ఇతర విద్యాశాఖ అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.