TEJA NEWS

పేటలో ప్లానింగ్ విభాగంపై అవినీతి ఆరోపణలు

చిలకలూరిపేట: లైసెన్స్‌డ్ ఇంజనీర్ల సమస్యలు, ప్రభుత్వానికి కోర్టులో వాయిదాలు వంటి పరిణామాల మధ్య పట్టణ ప్రజలు ఇళ్లు నిర్మించుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్న పట్టణ ప్రజలు. అధికారులు, సిబ్బంది నుంచి అనూహ్య డిమాండ్లు ఎదురవుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఈ అక్రమాలకు తాజా ఉదాహరణగా మద్ది నగర్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఒక ఘటన బయటపడింది. అక్కడ రెండు ఇళ్లను నిర్మించుకున్న యజమానుల వద్దకు ఒక అవుట్‌సోర్సింగ్ సిబ్బంది వచ్చి, తమ అధికారి చెప్పాడని, ఒక్కో ఇంటికి రూ. 15,000 చొప్పున రెండు ఇళ్లకు కలిపి రూ. 30,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ డిమాండ్‌తో నివ్వెరపోయిన ఇంటి యజమానులు, తమకు తెలిసిన వారికి ఫోన్ చేసి విషయాన్ని వివరించగా, “మేము చూసుకుంటాంలే” అని సదరు వ్యక్తులు సమాధానం ఇచ్చినట్లు తెలిసింది.ఈ ఘటన పట్టణంలో సంచలనం సృష్టించింది. ప్రణాళిక విభాగంలో జరుగుతున్న అవినీతి, అవుట్‌సోర్సింగ్ సిబ్బంది ద్వారా అక్రమ వసూళ్లు వంటి అంశాలు పట్టణ ప్రజలను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. ఇప్పటికే ఇళ్లు కట్టుకోవడానికి అనుమతులు, ఇతర ప్రక్రియల్లో జాప్యం, క్లారిటీ లేకపోవడంతో ప్రజలు సతమతం అవుతున్నారు. దీనికితోడు ఇలాంటి అక్రమ డిమాండ్లు వారిని మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.ఈ విషయంపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, ప్రణాళిక విభాగంలో పారదర్శకతను తీసుకురావాలని, అవినీతికి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.