
అన్నా క్యాంటీన్ లు మరింత సమర్థవంతంగా నిర్వహణ : కమిషనర్ పీ.శ్రీ హరిబాబు
చిలకలూరిపేట పట్టణంలోఅన్నా క్యాంటీన్లు మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు నిర్వాహకులు మరింత కృషి చేయాలని సూచించామని చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు అన్నారు. పట్టణంలో అన్నా క్యాంటీన్లను ఆయన ప్రత్యేకంగా పరిశీలించారు. ఎన్.ఆర్.టి. సెంటర్, పురుషోత్తమ పట్నం, గడియారం స్తంభం వద్ద
ఉన్న అన్నా క్యాంటీన్ లను పరిశీలించి అక్కడ నెలకొన్న పరిస్థితులను గమనించారు. ముఖ్యంగా ఆహారం శుచిగా ఉందా లేదా అన్న విషయమై ఆహారం స్వీకరిస్తున్న వారిని అడిగి తెలుసుకున్నారు. అయితే సుచిగా, వేడిగా, రుచికరమైన ఆహారం లభిస్తుందని వారు చెప్పడంతో సంతృప్తి వ్యక్తం చేశారు.అక్కడే అల్పాహారం తీసుకున్న కమిషనర్ , ఆ తర్వాత ఆర్వో వాటర్ ప్లాంట్ ను పరిశీలించారు. అన్నా క్యాంటీన్ల పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉన్నాయా లేదా అని తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మక అన్నా క్యాంటీన్లు నిర్వహిస్తున్న తరుణంలో ఆకస్మిక తనిఖీలను కూడా అప్పుడప్పుడు చేపడుతుంటామన్నారు. ఇందులో భాగంగా ఈరోజు పట్టణంలో ఉన్న మూడు అన్నా క్యాంటీన్ల ను పరిశీలించామని తెలిపారు. అన్నీ సంతృప్తిగా ఉన్నాయని వెల్లడించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంతోపాటు పౌష్టికాహారం, వేడివేడి ఆహార పదార్థాలను అందించడం జరుగుతుందన్నారు.
