
అన్నా క్యాంటీన్లలో” ఆహారం నాణ్యంగా ఉండాల్సిందే..!
** నిర్వాహకులకు మున్సిపల్ కమిషనర్ ఆదేశం
తిరుపతి: ప్రజలకు “అన్నా క్యాంటీన్ల” ద్వారా నాణ్యమైన ఆహారం అందించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య నిర్వాహకులను ఆదేశించారు. ఉదయం నగరంలోని అన్నా క్యాంటీన్లను, తిమ్మినాయుడు పాలెం వద్ద అభివృద్ధి పనులతో పాటు పారిశుద్ధ్యం తీరును అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో నాలుగు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్లలో పేద ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించాలని అన్నారు. క్యాంటీన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. తిమ్మినాయుడు పాళెం ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలని, పెండింగ్లో ఉన్న డ్రైనేజీ కాలువ పనులు త్వర త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. వీధి దీపాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజనీర్ గోమతి, ఏసిపి మూర్తి, డి.ఈ.రమణ, శిల్పా, సర్వేయర్ కోటేశ్వర రావు, శానిటరీ సూపర్ వైజర్ సుమతి తదితరులు ఉన్నారు.
