Spread the love

ఆత్మహత్యలు ఆపకుండా అందాల పోటీలా.. పిచ్చోడి చేతిలో రాయిలా రేవంత్‌ సర్కార్‌ పాలన: కేటీఆర్‌..!!

ఆటో డ్రైవర్లు, అన్నదాతల ఆత్మహత్యలతో రాష్ట్రం అల్లాడుతుంటే 250 కోట్లతో అందాల పోటీలా
కాంగ్రెస్‌ పాలనలో రైజింగ్‌ కాదు.. తెలంగాణ డౌన్‌ ఫాలింగ్‌!
బంగారం లాంటి రాష్ర్టాన్ని రేవంత్‌ కుప్పకూల్చిండు

క్యాన్సర్‌తో పోల్చి తెలంగాణను నాశనం చేసిండు
రాష్ట్ర ఆదాయం రూ.71 వేల కోట్లు తగ్గిందని ఒప్పుకొని ముఖ్యమంత్రే అప్రూవర్‌గా మారిండు
డబ్బుల్లేవంటూనే అందాల పోటీలకు 250 కోట్లా?
రేవంత్‌ దాటిన రేఖలపై మేమూ మాట్లాడగలం
మేం నోరిప్పితే ఆయనకు ఇంట్లో అన్నం పెట్టరు!
తనదాకా వస్తే నీతిసూత్రాలు.. నైతిక విలువలా?
కేసీఆర్‌పై ద్వేషంతో రైతులపై పగ సాధిస్తున్న సీఎం
ముఖ్యమంత్రి రేవంత్‌ ఢిల్లీకి 40 సార్లు కాకుంటే 400 సార్లు పోయి మోదీ, రాహుల్‌గాంధీ కాళ్లు పట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు
మీడియా చిట్‌చాట్‌లో మాజీ మంత్రి కేటీఆర్‌ ఫైర్‌
రాష్ట్రంలో వ్యవసాయం, పెట్టుబడులు, పరిశ్రమలు పెరుగుతున్నాయని ప్రభుత్వం గొప్పలు చెప్తుంటే మరి ఆదాయం ఎట్ల తగ్గింది? బంగారం లాంటి రాష్ర్టాన్ని అప్పజెప్తే, క్యాన్సర్‌ అంటూ మాట్లాడి రేవంత్‌ సర్వనాశనం చేసిండు. ఏ రంగాల్లో వృద్ధి పెరిగిందో ఈ బడ్జెట్‌లో చెప్పాలె. రాష్ర్టానికి రూ.71 వేల కోట్ల ఆదాయం తగ్గిందని చెప్పి బడ్జెట్‌కు ముందే రేవంత్‌ తన నేరాన్ని అంగీకరించి అప్రూవర్‌గా మారిండు.

– కేటీఆర్‌

ఓ వైపు రైతులు, ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలతో అల్లాడుతున్న రాష్ట్రంలో అందాల పోటీలు నిర్వహించటం సిగ్గుచేటు. ఆ అందాల పోటీలతో ఊరూరా బ్యూటీపార్లర్లు ఏమైనా పెడుతరా? వాటి వల్ల ఎవరికి లాభమో సీఎం, కాంగ్రెస్‌ ప్రభుత్వం సమాధానం చెప్పాలె. రాష్ట్రం తీవ్ర కరెంట్‌, వ్యవసాయ సంక్షోభంలో చికుకుంటే.. సర్కారు ఫోకస్‌ మొత్తం అందాల పోటీల మీద పెట్టడం విషాదకరం.