Spread the love

ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పొందిన లబ్ధిదారులు వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలి

  5.00 లక్షల రూపాయలు విడతల వారీగా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే జమ అవుతాయి పైరవీదారులను ఆశ్రయించవద్దు - రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ యం.డి  వి.పి. గౌతం

వనపర్తి :
గ్రామ సభల ద్వారా ఆమోదం పొంది ఇందిరమ్మ ఇళ్లు అనుమతి పొందిన లబ్ధిదారులు నిబంధనల ప్రకారం నిర్మించుకునేందుకు పనులు ప్రారంభించాలని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ యం.డి. వి.పి. గౌతం సూచించారు.

 వనపర్తి జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్ తో కలిసి కొత్తకోట మండలం రామనాథపురం, వనపర్తి మండలంలోని అప్పాయపల్లి గ్రామాలను సందర్శించి లబ్ధిదారుల ఇళ్లను పరిశీలించారు. అప్పాయిపల్లి గ్రామంలో లబ్ధిదారులు సువర్ణ, వరలక్ష్మి ల ఇండ్లను సందర్శించి, వారి ఆర్థిక స్థితిగతులు తెలుసుకున్నారు. 

అప్పాయి పల్లి, రాజాపేట గ్రామాల్లో ఇదివరకే ప్రభుత్వం నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించారు. ఆ ప్రాంతంలో కనీస మౌలిక వసతులు కల్పించాలని స్థానికులు కోరగా, సానుకూలంగా స్పందించారు. 

   అనంతరం వనపర్తి జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయ ఆవరణలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నమూనా హౌస్ ను పరిశీలించారు. ఆ తర్వాత వనపర్తి జిల్లా ఐడీఓసీలోని కాన్ఫరెన్స్ హాల్లో హౌసింగ్ సంస్థ అధికారులు, ఎంపీడీవోలతో సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా గృహ నిర్మాణ శాఖ ఎం డి గౌతమ్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ఎంపికైన లబ్ధిదారులు వేగంగా నిర్మాణం ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోలకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం రూ.5.00 లక్షల విడతల వారీగా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే జమ అవుతాయని, పైరవీదారులను ఆశ్రయించవద్దని విజ్ఞప్తి చేశారు.

  మార్చి 31 లోపు లబ్ధిదారులకు మొదటి విడత చెల్లింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు, ఆదిశగా లబ్ధిదారులు నిర్మాణం ప్రారంభిస్తే మొదటి విడత చెల్లింపు చేయడం జరుగుతుందన్నారు. 

   లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం ప్రారంభించిన వెంటనే మొదటి దశ నిర్మాణానికి సంబంధించి గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు మొబైల్ యాప్ ద్వారా ఫోటోలు తీసి ప్రభుత్వానికి పంపించాలన్నారు. ప్రతి దశలో పంచాయతీ కార్యదర్శులు ఫోటోలని పంపించాల్సి ఉంటుందని  చెప్పారు. ఈ విషయంలో పంచాయతీ కార్యదర్శులకు ఎంపీడీవోలు స్పష్టమైన సూచనలు ఇవ్వాలని చెప్పారు. పంచాయతీ కార్యదర్శులు పంపే ఫోటోలను ఎంపీడీవోలు, ఏఈలు సూపర్ చెక్ చేయాలని సూచించారు. 

  లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్దేశిత డిజైన్ ఏమీ లేదని, 400 చదరపు గజాలలో వారికి నచ్చిన విధంగా ఇంటి నిర్మాణం చేసుకోవచ్చని చెప్పారు. 

    ఇప్పుడు మండలానికి ఒక గ్రామంలో ఇండ్ల నిర్మాణం ప్రారంభం అయిందని, మిగతా గ్రామాల్లో కూడా నిజమైన లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. 

  జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి మాట్లాడుతూ త్వరలోనే లబ్ధిదారులకు సమావేశం ఏర్పాటు చేసి ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించుకుని, మార్చి 31వ తేది లోపు మొదటి దశ పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా పైలట్ గ్రామాలు కాకుండా మిగతా అన్ని గ్రామాల్లోనూ నిజమైన అర్హుల జాబితా రూపొందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

   ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు నిర్మాణం కోసం ఇసుక గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, దగ్గర్లోని రీచ్ నుంచి ఎమ్మార్వో అనుమతి ద్వారా ఉచితంగా ఇసుకను పొందవచ్చని  చెప్పారు. లబ్ధిదారులు ట్రాన్స్పోర్ట్  భరించుకొని ఇసుకను పొందవచ్చు అని చెప్పారు. 

     సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, జెడ్పి సీఈవో యాదయ్య, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, హౌసింగ్  అధికారులు విఠోబా, పర్వతాలు, పంచాయతీరాజ్ ఈఈ మల్లయ్య, ఎమ్మార్వోలు రమేష్ రెడ్డి, కిషన్,  ఎంపీడీవోలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు