
ఏపీ ప్రభుత్వ గౌరవ సలహాదారుగా భారత్ బయోటెక్ ఎండీ.. సుచిత్ర ఎల్ల
చేనేత, హస్తకళల అభివృద్ధికి గౌరవ సలహాదారుగా సుచిత్ర ఎల్ల నియామకం
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్
ఈ పదవిలో కొనసాగనున్న సుచిత్ర ఎల్ల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి క్యాబినెట్ ర్యాంక్‌లో రెండేళ్ల పాటు ప్రభుత్వం వివిధ ప్రభుత్వ శాఖలకు సలహాదారుల నియామకాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటికే పలు శాఖలకు సలహాదారులను నియమించిన ప్రభుత్వం, తాజాగా చేనేత, హస్తకళల అభివృద్ధికి గౌరవ సలహాదారుగా భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్లను నియమించింది.
ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. కేబినెట్ ర్యాంకులో సుచిత్ర ఎల్ల రెండేళ్ల కాలానికి ఈ పదవిలో ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చేనేత, హస్తకళల అభివృద్ధి రూపకల్పనకు ఆమె నుంచి సలహాలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అలాగే ఏరో స్పేస్, డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ గౌరవ సలహాదారుగా డీఆర్డీఓ మాజీ చీఫ్ జి. సతీష్ రెడ్డి, ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ గౌరవ సలహాదారుగా కేపీసీ గాంధీ, ఏపీ స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారుగా శ్రీధర పనిక్కర్ సోమనాథ్ నియమితులయ్యారు. వీరి నియామకాలకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
