TEJA NEWS

ప్రతి భూకమతానికి భూదార్ కార్డు ఇవ్వడం జరుగుతుంది…….. ఎమ్మెల్యే మెగా రెడ్డి

వనపర్తి
ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఏ విధంగా అయితే ఉంటుందో, అదే మాదిరిగా భూ భారతి 2025 చట్టం ద్వారా రాష్ట్రంలోని ప్రతి భూకమతానికి భూధార్ కార్డు ఇవ్వడం జరుగుతుందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి అన్నారు.

       గురువారం పెద్దమందడి మండల కేంద్రంలోని రైతు వేదికలో 'భూ భారతి' భూమి హక్కుల రికార్డు - 2025 చట్టం గురించి, అందులోని ముఖ్యాంశాల గురించి రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి హాజరయ్యారు. ఆయనతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి, డిసిసిబి చైర్మన్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, ఆర్డీవో సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు భూభారతి చట్టంలోని ముఖ్యంశాలను రైతులకు వివరించారు. 

       ఎమ్మెల్యే మేఘా రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఏ విధంగా అయితే ఉంటుందో, అదే మాదిరిగా భూ భారతి 2025 చట్టం ద్వారా రాష్ట్రంలోని ప్రతి భూకమతానికి భూధార్ కార్డు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలోని రైతులు, మేధావులు, నాయకులు సహా అందరి సలహాలు,  సూచనలతోనే ప్రభుత్వం భూ భారతి చట్టం - 2025 ను రూపొందించి  అమలులోకి తెచ్చిందని చెప్పారు. గతంలో అమల్లో ఉన్న  ధరణి కారణంగా రైతులకు అనేక సమస్యలు ఎదురయ్యాయని, ఇప్పుడు ప్రజా ప్రభుత్వం తెచ్చిన భూభారతి చట్టంతో అన్ని వివాదాలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం భూ భారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చారని చెప్పారు. 

     చట్టంలో ఉన్న నియమాలను అమలు చేయడంలో రెవెన్యూ అధికారులది కీలక పాత్ర అని, కాబట్టి వారు ఈ చట్టాన్ని అమలు చేయడంలో వారికి ప్రజలు కూడా సహకరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఏ విధంగా ఉంటుందో, అదేవిధంగా ఈ భూభారతి చట్టం ద్వారా ప్రతి ఒక్క భూమికి భుదార్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. 

   ఇవే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కడుపు నింపడానికి రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం అందిస్తుందని చెప్పారు. ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు సైతం కట్టించేందుకు వేగంగా అడుగులు ముందుకు వేస్తుందని అన్నారు. రాజీవ్ యువ వికాసంతో యువతకు స్వయం ఉపాధి బాటలు వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అంతేకాకుండా, మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా మహిళా సంఘాల ద్వారా సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయించడం, మహిళా సంఘాల ద్వారా బస్సులను కొనుగోలు చేయించి ఆర్టీసీ లో పెట్టించి మహిళల్ని వాటికి  యజమానులను చేస్తుందన్నారు. విద్యార్థుల చదువు కోసం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. 

   కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం గతంలో ఉన్న ధరణి స్థానంలో భూభారతి భూమి హక్కుల రికార్డు - 2025 చట్టాన్ని కొత్తగా తీసుకువచ్చిందని తెలిపారు. ఈ చట్టంపై రెవెన్యూ రైతులతో పాటు అందరూ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ సూచించారు.  

    ప్రభుత్వం ఈ నూతన చట్టం ద్వారా అనేక భూ సమస్యలకు పరిష్కార మార్గం చూపించనుందని తెలిపారు. చట్టం తో పాటు, రూల్స్ కూడా ఒకేసారి అమల్లోకి తెచ్చిందన్నారు. ఈ చట్టం ద్వారా తహసిల్దారు చేసిన మ్యూటేషన్లు, జారీ చేసిన పాస్ పుస్తకాలపై అభ్యంతరాలు ఉంటే ఆర్డిఓకు లేదా కలెక్టర్కు అప్పిలు చేసుకునేలా వ్యవస్థను తీసుకువచ్చిందన్నారు. అదేవిధంగా భూముల సక్సేషన్ విషయంలో 30 రోజుల గడువు పెట్టి వేగంగా పరిష్కారం అయ్యే విధంగా వెసులుబాటు కలగనుందన్నారు. భూ భారతి చట్టం- 2025  ప్రకారం ఒకేరోజు రిజిస్ట్రేషన్ తో పాటు మ్యుటేషన్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. అంతేకాకుండా ప్రతి ఒక్క భూకమతానికి యూనిక్ ఐడి భూదార్ ఇవ్వడం గురించి కూడా తెలియజేశారు. 

సన్న బియ్యం లబ్ధిదారుల ఇంట్లో భోజనం చేసిన కలెక్టర్, ఎమ్మెల్యే
పెద్దమందడి మండల కేంద్రంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి, డిసిసిబి చైర్మన్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి స్వప్న అనే దళితకుటుంబానికి చెందిన సన్న బియ్యం లబ్ధిదారుల ఇంటిని సందర్శించి, వారి ఇంట్లోనే ప్రభుత్వం ఉచితంగా అందించిన సన్నబియ్యంతో వండిన భోజనాన్ని కుటుంబ సభ్యులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అందించే నాణ్యమైన సన్న బియ్యంను రేషన్ కార్డుదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పేదలు కూడా నాణ్యమైన ఆహారం తినాలనే ఆలోచనతోనే ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని తీసుకు వచ్చిందని, ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

   సమావేశంలో ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, వనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్, తహసీల్దార్ సరస్వతి, ఇతర అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.