
బొల్లుమోర వెంకటేశ్వరస్వామి వార్షిక తిరునాళ్లకు భక్తజన సందడి
- శాంతి కల్యాణంతో కళకళలాడిన కొండవీడు కొండలు
:కొండవీడు కొండల శిఖరాలను భక్తి పరిమళాలు తాకాయి… పురాతన బొల్లుమోర వెంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం జరిగిన వార్షిక తిరునాళ్ల మహోత్సవం భక్తిశ్రద్ధలతో నిండిపోయింది.
అర్చకులు స్వామివారిని విశేషంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించగా, స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం పండగ వాతావరణం సంతరించుకుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తులు “గోవింద… . గోవింద..” అంటూ చేసిన నినాదాలు కొండల గుండెల్లో మార్మోగాయి.
అనంతరం భాజా భజంత్రీలతో.. అశేష భక్తజనం నడుము.. పండితుల వేదమంత్రాలతో..కన్నుల పండువగా నిర్వహించిన శాంతి కల్యాణంలో వివాహిత దంపతులు పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందారు. భక్తులకు ప్రత్యేకంగా అన్నసంతర్పణ ఏర్పాటు చేసి, ఆధ్యాత్మిక తృప్తిని అందించారు. ఈ సందర్భంగా ఆలయానికి విద్యుత్ దీపాల అలంకరణ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి
