TEJA NEWS

సెప్టెంబర్ 24నుంచి తిరుమలలో బ్రహ్మోత్సవాలు

** ఏర్పాట్ల సన్నాహక సమీక్షలో టీటీడీ అడిషనల్ ఈఓ

తిరుమల: తిరుమలలో శ్రీవారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేది వరకు జరగనున్నాయని టీటీడీ అడిషనల్ ఈఓ సి.హెచ్‌.వెంకయ్య చౌదరి చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రణాళికలు రూపొందించి నిర్దేశిత సమయంలోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన విభాగాధిపతులను ఆదేశించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలపై తిరుమలలోని అన్నమయ్య భవన్ లో ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టబోయే ఏర్పాట్లపై విభాగాల వారీగా సమీక్షించి పలు సూచనలు చేశారు.

సమావేశం ముఖ్యాంశాలు:

సెప్టెంబర్ 16న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం,
23న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, 24న ధ్వజారోహణం, 28న గరుడ వాహనం, అక్టోబర్ 01న రథోత్సవం, 02న చక్రస్నానం ఉంటాయని పేర్కొన్నారు. ఉత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయి. బ్రహ్మోత్సవ రోజుల్లో భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు.
వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐ, దాతల దర్శనాలు కూడా రద్దు చేశారు. టీటీడీ విజిలెన్స్, పోలీసు విభాగాల సమన్వయంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి, రోడ్ మ్యాప్ లు, పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని ఆదేశం చేశారు. భక్తులకు దర్శన క్యూలైన్లు, మాడ వీధుల్లోని గ్యాలరీలు, ముఖ్యమైన ప్రాంతాల్లో విరివిగా అన్న ప్రసాదాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
భక్తుల అవసరాలకు అనుగుణంగా ఇంజనీరింగ్ పనులు చేపట్టాలని ఆదేశం.
గ్యాలరీల్లో భక్తులకు సమస్యలు తలెత్తకుండా మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచేందుకు అదనపు సిబ్బందిని తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా భక్తులను ఆకట్టుకునే విధంగా విద్యుత్ అలంకరణలు, ఫల, పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేయాలని ఆదేశం. శ్రీవారి సేవకులుగా యువతీ, యువకులను ఆహ్వానించి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని ఆదేశం. ఈ సమీక్ష లో డీఎఫ్వో ఫణి కుమార్ నాయుడు, ట్రాన్స్ పోర్ట్ జీఎం శేషారెడ్డి, సీపీఆర్వో డాక్టర్ రవి, తిరుమల పీఆర్వో నీలిమ, డిప్యూటీ ఈవోలు లోకనాథం, భాస్కర్, రాజేంద్ర కుమార్, సోమన్నారాయణ, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, టీటీడీ ఆల్ ప్రాజెక్ట్స్ ఆఫీసర్ రాజగోపాల్, ఈఈలు సుబ్రహ్మణ్యం, వేణు గోపాల్, డిఈ చంద్రశేఖర్, అశ్వినీ ఆసుపత్రి సివిల్ సర్జన్ కుసుమ కుమారి, ఎస్వీబీసీ ఓఎస్డీ పద్మావతి, వీజీవోలు రామ్ కుమార్, సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.