Spread the love

గత ప్రభుత్వం తప్పుల తడకగా మార్చిన భూరక్ష – భూసర్వే సమస్యలు పరిష్కరించండి : మాజీమంత్రి ప్రత్తిపాటి

చిలకలూరిపేట స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో భూ సమస్యలపై సమీక్ష నిర్వహించిన మాజీమంత్రి ప్రత్తిపాటి

  • ప్రజల నుంచి వచ్చిన భూ వివాదాలు, రీసర్వే సమస్యలు పరిష్కరించాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించిన ఎమ్మెల్యే
  • చిలకలూరిపేట తహసీల్దార్ కార్యాలయంలో మంచినీరు, మజ్జిగ చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

భూరక్ష – భూసర్వే పేరుతో గత ప్రభుత్వం నిర్వహించిన భూముల సర్వే ప్రక్రియ తలాతోక లేకుండా సాగిందని,సర్వేనంబర్లు.. రైతుల వివరాలు.. భూమివిస్తీర్ణానికి సంబంధించిన వివరాల్లో కచ్చితత్వం లేకుండా పోయిందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది ఏర్పాటు చేసిన మంచినీటి, మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం భూ సమస్యలపై రెవెన్యూ సిబ్బందితో మాజీమంత్రి సమీక్ష నిర్వహించారు. వైసీపీప్రభుత్వం రైతుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోకుండా, భూముల సర్వే నిర్వహించిందని, రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న భూముల ఫిర్యాదుల్లో ఎక్కువ భాగం సర్వేకు సంబంధించినవే ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు, పొరపాట్లు సరిదిద్దుతూనే సంక్షేమం, అభివృద్ధికి కూటమిప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ప్రత్తిపాటి తెలిపారు. శాశ్వత భూహక్కు-భూరక్ష పేరుతో గత ప్రభుత్వం భూసర్వేను లోపభూయిష్టంగా నిర్వహించిందన్న ఎమ్మెల్యే, దానివల్ల హక్కు పత్రాల్లో తప్పులు, విస్తీర్ణం తగ్గడం, పేర్లు మారడం వంటి అనేక సమస్యలు తలెత్తాయన్నారు. ఇప్పటికీ సర్వే పూర్తయిన గ్రామాల్లో భూముల సమాచారం సరిగా లేదని, కొన్నిచోట్ల ఆన్ లైన్లో వివరాలు కూడా కనిపించడం లేదన్నారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని భూ యజమానులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉందని ప్రత్తిపాటి స్పష్టం చేశారు. రెవెన్యూ సిబ్బంది తక్షణమే భూ ఫిర్యాదుల పరిష్కారంపై దృష్టి పెట్టాలన్నారు. సమస్యలతో ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు న్యాయం చేయడాన్ని మించిన పురస్కారాలు, గౌరవాలు మరేవి ఉండవనే విషయాన్ని అధికార యంత్రాంగం గుర్తించాలని పుల్లారావు సూచించారు.

మంచినీటి, మజ్జిగ చలివేంద్రం ప్రారంభం..

తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది కార్యాలయ ఆవరణలో తమ సొంత నిధులతో ఏర్పాటుచేసిన మంచినీటి, మజ్జిగ చలివేంద్రాన్ని ప్రత్తిపాటి ప్రారంభించారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఎమ్మార్వో కార్యాలయ సిబ్బంది ముందుకు రావడం నిజంగా మంచి విషయమని పుల్లారావు కొనియాడారు. సేవాగుణాన్ని చాటుకున్న కార్యాలయ సిబ్బందిని మాజీమంత్రి పేరుపేరునా అభినందించారు. సమీక్షా సమావేశంలో తహసీల్దార్ హుస్సేన్, ఆర్.ఐ రమీజా, సర్వేయర్ ప్రసాద్ ఇతర సిబ్బంది, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, జనసేన ఇంచార్జి తోట రాజా రమేష్, టీడీపీ నాయకులు షేక్ టీడీపీ కరీముల్లా, నెల్లూరి సదాశివరావు, జవ్వాజి మధన్ మోహన్, బండారుపల్లి సత్యనారాయణ, కామినేని సాయి బాబు, పఠాన్ సమాధ్ ఖాన్, మద్దుమాల రవి, కందుల రమణ కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.