
తెలంగాణలో మళ్లీ కుల గణన
కీలక నిర్ణయం తీసుకున్న రేవంత్ ప్రభుత్వం… స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యం;
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ 15వ తేదీ లోపు వెలువడుతుందని అందరూ భావించారు. కానీ, ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరోసారి కులగణన సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్వేలో పాల్గొనని వారికి ఈ నెల 16 నుంచి 28వ తేదీ వరకు అవకాశం కల్పించింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని స్పష్టం చేసింది. రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందాకే ఎన్నికలు జరిగే అవకాశముంది. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. స్థానిక ఎన్నికల తేదీలను ప్రకటిస్తారేమోనని అనుకున్నారు. అయితే కులగణన రీసర్వేకు నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సర్వే స్పష్టంగా ఉందని .. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం రాజకీయ ప్రయోజనాలు పక్కకు పెట్టి అభివృద్ధికి మద్దతు పలకాలని పేర్లు నమోదు చేసుకోని వారికి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. కులగణనలో పాల్గొనని 3.1 శాతం మంది కోసం మరోసారి సర్వే చేపడుతున్నామని ఇప్పటికే నమోదు చేసుకున్న వారు అవసరం లేదని భట్టి విక్రమార్క ప్రకటించారు.
స్థానిక సంస్థల ఎన్నికలు అప్పుడే: భట్టి
స్థానిక సంస్థల ఎన్నికలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ వచ్చాకే ఎన్నికలు జరుగుతాయన్నారు. ‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై మార్చి మొదటి వారంలో కేబినెట్ తీర్మానం చేయనుంది. శాసనసభలో బిల్లు ఆమోదం చేసి చట్టబద్ధం చేయాలని నిర్ణయించాం. కులగణన బిల్లును కేంద్రానికి పంపుతాం. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పార్లమెంట్‌లో ఆమోదానికి కృషి చేస్తాం’ అని అన్నారు.
పేర్లు నమోదు చేసుకోని 3.1 శాతం మంది
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కులగణన చేపట్టింది. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కూడా ప్రవేశ పెట్టారు. అయితే చాలా మంది వివరాలు నమోదు చేయలేదని.. ఉద్దేశపూర్వకంగా జనాభాను తగ్గించారని రాజకీయ నేతలు, బీసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. పదేళ్ల కిందట కేసీఆర్ సమగ్ర కుటుంబసర్వేను చేశారు. అప్పటి రికార్డులతో పోలిస్తే ఇప్పుడు జనాభా తగ్గిపోయారని..కుటుంబాలు తగ్గిపోయారని ..ఇది ఫేక్ సర్వే అంటున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం కొంత మంది ఉద్దేశపూర్వకంగానే వివరాలు ఇవ్వలేదని చెబుతోంది.
