అమరావతి: నంద్యాల ఎస్పీ రఘువీర్‌రెడ్డిపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం

TEJA NEWS

అమరావతి: నంద్యాల ఎస్పీ రఘువీర్‌రెడ్డిపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కోడ్‌ అమల్లో విఫలమైన ఎస్పీపై ఛార్జెస్‌ ఫైల్‌ చేయాలని ఈసీ ఆదేశించింది. ఎస్పీతో పాటు ఎస్‌డీపీవో రవీంద్రనాథ్‌రెడ్డి, సీఐ రాజారెడ్డిపైనా శాఖాపరమైన విచారణ జరపాలని డీజీపీకి ఉత్తర్వులు జారీ చేసింది.ముగ్గురు అధికారులపై తీసుకున్న చర్యల వివరాలను ఆదివారం రాత్రి 7గంటల్లోపు తెలియజేయాలని ఈసీ ఉత్తర్వు్ల్లో పేర్కొంది. సినీనటుడు అల్లు అర్జున్‌ నంద్యాల పర్యటనకు సంబంధించి ఎలాంటి అనుమతి తీసుకోలేదని ఈసీ తెలిపింది. ఆయన్ను చూసేందుకు భారీగా అభిమానులు గుమికూడారని, 144 సెక్షన్‌ అమలులో ఉన్నా జనాలను నియంత్రించటంతో పోలీసులు విఫలమయ్యారని ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అల్లు అర్జున్‌పై ఇప్పటికే కేసు నమోదైందని తెలిపింది.
ఏం జరిగిందంటే?
నంద్యాలలో సినీ నటుడు అల్లు అర్జున్‌ పర్యటన వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఆయన పర్యటనకు రిటర్నింగ్‌ అధికారి ముందస్తు అనుమతులు ఇవ్వలేదు. నంద్యాల ఎమ్మెల్యే, వైకాపా అసెంబ్లీ అభ్యర్థి శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి ఇంటికి శనివారం ఉదయం అల్పాహారానికి అల్లుఅర్జున్‌ వచ్చారు. వైకాపా శ్రేణులు వ్యూహాత్మకంగా పట్టణ శివారు నుంచే భారీ వాహనాలు, మోటారు సైకిళ్లతో ప్రదర్శనగా పట్టణంలోకి ఆయనను తీసుకువచ్చాయి. ఆయన పర్యటనకు అధికారిక అనుమతులూ లేకపోయినా పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ విషయాన్ని కొందరు ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉండగా ఇంచుమించు అదే సమయంలో హీరో అర్జున్‌ పర్యటన ఉండటంతో జిల్లా కేంద్రంలో కొంతసేపు ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై ఫిర్యాదులు అందడంతో ఎన్నికల సంఘం స్పందించింది.

Print Friendly, PDF & Email

TEJA NEWS

Similar Posts