TEJA NEWS

పాకిస్తాన్‌లో పెట్రోల్ బంకులు క్లోజ్..

ఆపరేషన్ సిందూర్‌ దెబ్బ పాకిస్తాన్‌కు గట్టిగానే తగులుతోంది. భారత్ వరుస దాడులతో బిత్తరపోతున్న పాకిస్తాన్‌కు తాజాగా మరో సంక్షోభం ఎదురైనట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. దీంతో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో రెండు రోజుల పాటు పెట్రోల్‌ బంక్‌లు మూసేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే నిత్యవసర వస్తువుల ధరలు పెరిగిపోయిన ప్రజలు అవస్థలు పడుతున్నారు. తాజాగా, పెట్రోల్ బంకుల మూసివేత నిర్ణయంతో ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

పాకిస్తాన్‌ ఇస్లామాబాద్‌ లోని అన్ని పెట్రోల్, డీజిల్‌ బంకులను 48 గంటల పాటు మూసేయాలని అక్కడి అధికారులు నిర్ణయించారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి గల అసలు కారణాలు ఏంటనే విషయం తెలియాల్సి ఉంది. అయితే ఇంధన కొరత కారణంగానే బంక్‌లను మూసేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారత్ – పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఆయిల్ నిల్వలను పెంచుకోవడం కోసమే ఈ చర్యలు చేపట్టి ఉంటుందని సమాచారం. ఈ నిర్ణయంతో ప్రైవేట్ వాహనాలే కాకుండా ప్రభుత్వం వాహనాలకు కూడా ఇంధనం లేని పరిస్థితి నెలకొంది.

పెట్రోల్ బంకుల మూసివేత వెనుక మరో కారణం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. పాకిస్తాన్ తన ఆర్మీ వాహనాలను కొండలు, గుట్టల ప్రాంతాల్లో నడపాల్సి వస్తోంది. ఇందుకోసం పెట్రోల్, డీజిల్ ఎక్కువ స్థాయిలో అవసరం ఉంటుంది. అలాగే బ్లాక్ అవుట్ సమయంలో జనరేటర్లను ఎక్కగా వాడాల్సి ఉంటుంది. దీంతో బంకులు మూసేయడం వల్ల ఇంధనాన్ని ఆ అవసరాలకు వినియోగించే యోచనలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు యుద్ధం తీవ్రతరమైతే నిత్యావసరాల కొనుగోలుకు కూడా పాకిస్తాన్ వద్ద ఆర్థిక వనరులు ఉండవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే అప్పుల కోసం పాకిస్తాన్ పలు అంతర్జాతీయ సంస్థలను అర్థిస్తోంది. చివరకు తమ దేశ ప్రజలను కూడా అప్పులు అడుక్కునే స్థితికి వచ్చినట్లు తెలుస్తోంది