Spread the love

చిల‌క‌లూరిపేట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అవినీతి దందా

ప్ర‌తిప‌నికి ఓ రేటు చొప్ప‌న వ‌సూలు చేస్తున్న అవినీతి జ‌ల‌గ‌లు

ఇక్క‌డ డ‌బ్బులు క‌డితేనే ద‌స్త్రాలు క‌దిలేది

మ‌ధ్య‌ద‌ళారీల‌దే హ‌వా.

చిల‌క‌లూరిపేట‌:
ప్రజా సేవే పరమావధిగా పని చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు లంచావతారులుగా మారుతున్నారు. ప్రభుత్వం నుంచి వేతనాలు తీసుకుంటునే సులువుగా డబ్బు సం పాదించేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు.కింది స్థాయి ఉద్యోగుల నుంచి పైస్థాయి అధికారుల వరకు కాసులు ఇవ్వనిదే కనికరించడంలేదు. చిల‌క‌లూరిపేట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యా లయంలో అవినీతి రాజ్యమేలుతోంది. ప్రతీ పనికి డబ్బులు గుంజడం సిబ్బందికి అలవాటైపోయింది. పైసలియ్యకపోతే గంటలో కావాల్సిన పనికి రోజుల తరబడి కార్యాలయం చుట్టూతిప్పుకుంటున్నారు. కొన్ని రిజిస్ట్రేష‌న్లు కూడా నిలిపి వేసి ఏదో ఒక సాకుల‌తో వేధిస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిని ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి అని సమాధానం ఇస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని రూపుమాపేందుకు ముఖ్యంగా భూముల విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలె త్తకుండా ఆన్‌లైన్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది.అయినా పేరుకే ఆన్‌లైన్,డ‌బ్బులు గుంజ‌టంతో ఆఫ్‌లైన్ అన్న‌ట్లు త‌యారైందని ప్ర‌జ‌లు వాపోతున్నారు.

డ‌బ్బులు క‌డితేనే ద‌స్త్రాలు క‌దిలేది…

సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయం గోడలకు సిటిజన్‌ చార్టు బో ర్డులు అతికించారు. అందులో పేర్కొన్న విధంగా సమయపాలన పాటిం చకపోవడంతో అవి అలంకారప్రాయంగా మారిపోయాయి. సిటిజన్‌ చార్టర్‌ లో ఒక్కో పనికి ఎంత సమయం పడుతుందనేది స్పష్టంగా పేర్కొన్నారు. అదనంగా ముడుపులు చెల్లిస్తేనే పనులు జరుగుతాయి. లేకుంటే రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిరగాల్సిందే.

ప్ర‌తిప‌నికి ఓ రేటు…

రిజిస్ట్రేషన్లు చేయడానికి అన్ని కాగితాలు సక్రమంగా ఉన్నా అమ్యామ్యాల కోసం ఏవేవో కొర్రీలు పెట్టడం ఈ శాఖ అధికారికి వెన్నతో పెట్టిన విద్యే. మామూలు ఇవ్వనిదే ఏ డాక్యుమెంట్‌ రిజిస్ట్రేషన్‌ వరకు వెళ్లపోగా, భూమి రిజిస్ట్రేషన్‌ చేస్తే ఓ రేటు, ఇండ్ల రిజిస్ట్రేషన్‌ చేస్తే మరో రేటును మామూళ్లుగా వసూలు చేస్తూన్నారు. భూములు, ఇతర ఆస్తులకు సంబంధించిన దస్తావేజుల రిజిస్ట్రేషన్లకు మార్కెట్‌ వాల్యుపైన సేల్‌ డీడ్‌ అయితే స్టాంపు డ్యూటీ 4 శాతం, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ సుంకం 1.5 శాతం, రిజిస్ట్రేషన్‌ చార్జీలు 0.5 చొప్పున మొత్తం 6 శాతం చార్జీలు చెల్లించాలి. అదే గిఫ్ట్‌ డీడ్‌ అయితే స్టాంపు డ్యూటీ 1 శాతం, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ 0.5 శాతం, రిజిస్ట్రేషన్‌ ఫీజు 0.5 చొప్పున కనీసం రూ. 1000, గరిష్టంగా రూ. 10 వేలు చెల్లించాలి. పై చార్జీలు ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉండగా ఒక్కో డాక్యుమెంట్‌పై రూ.1000 వరకు అక్రమంగా వసూలు చేస్తున్నట్లు తెలి సింది. నిబంధనల మేరకు లొసుగులు ఉన్న పక్షంలో కనీసం రూ. 5 వేల నుంచి గరిష్టంగా రూ. 25 వేల వరకు వసూలు చేస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు.

మ‌ధ్య‌ద‌ళారీల‌దే హ‌వా..

స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యంలో ప్రైవేటు వ్య‌క్తులు హ‌ల్చల్ చేస్తున్నారు. అధికారుల క్యాబిన్ల‌లో కూర్చుంటూ రేట్లు ఫిక్స్ చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. కార్యాల‌యంలో అధికారుల‌కన్నా.. రైట‌ర్ల హ‌డావుడే ఎక్కువ‌గా క‌నిపిస్తుండ‌టం విశేషం. రిజిస్టేషన్​ కార్యాలయం సమీపంలో అనధికారికంగా ఆఫీసులను ఏర్పాటు చేసుకున్న కొంత‌మంది రైట‌ర్లు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. కొనుగోలు, అమ్మకందారుల డాక్యుమెంట్లను రెడీ చేయాల్సిన రైటర్లు సబ్​ రిజిస్ట్రార్​ సిబ్బందికి అదనపు ఆదాయ వనరుగా మారారు. అక్రమాలు బయట పడకుండా, సిబ్బంది తప్పులు ఎవరికీ కనపడకుండా చూడడంలో వీరే అధికారుల‌కు అన్ని విధాలుగా ర‌క్ష‌ణ‌గా ఉంటున్న‌ట్లు స‌మాచారం. వారిని కాద‌ని నేరుగా కార్యాల‌యంలో అధికారుల‌ను సంప్ర‌దించినా ప‌నులు కావ‌ని, ఫైళ్లు క‌ద‌ల‌వ‌ని కొంత‌మంది అనుభ‌వ‌పూర్వ‌కంగా చెబుతుండ‌టం గ‌మనార్హం. ఇదిలా ఉంటే స‌బ్ రిజిస్ట్రార్‌కు అత్యంత స‌న్నిహితంగా మెలిగే ఓ వ్య‌క్తి కార్యాల‌యంలో హ‌ల్ చ‌ల్ చేస్తుంటాడు. ఇత‌ని ద్వారా వెళ్లే ఏ ఫైల్ ఆగిన దాఖ‌లాలు లేవ‌ని చెబుతున్నారు. ఇందువ‌ల్ల ఇత‌ను కార్యాల‌యంలో కీల‌కంగా మారాడు. మ‌రోవిశేష‌మేమిటంటే ఇత‌ని రేటు కూడా స‌ప‌రేట్ అని అందుకే అవ‌క‌,త‌వ‌క‌లు ఉన్న డాక్యుమెంట్లు, ఎక్క‌వ‌గా రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులవి ఇత‌ని నుంచే స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యంలోకి వెళుతుంటాయి. ఈ స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌య అవినీతి భాగోతంపై పూర్తి స్థాయిలో విచార‌ణ నిర్వ‌హించాల‌ని బాధితులు కోరుతున్నారు.