Spread the love

ఖ‌ర్చులు పెరిగి, దిగుబ‌డి త‌గ్గి మిర్చి రైతుల వెత‌లు

రాష్ట్రంలో మిర్చిని కేంద్ర ప్ర‌భుత్వ‌మే కొనుగోలు చేయాలి

జ‌న‌సేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-క‌న్వీన‌ర్ పెంటేల బాలాజి

చిల‌క‌లూరిపేట‌:మిర్చి రైతులు మరోసారి సంక్షోభంలోకి జారిపోయారని, ధరలు సగానికి పతనం కావడంతో తీవ్ర నష్టాలను చవిచూస్తున్నార‌ని, మిర్చి రైతుల‌ను కేంద్రం ఆదుకోవాల‌ని జ‌న‌సేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-క‌న్వీన‌ర్ పెంటేల బాలాజి విజ్ఞ‌ప్తి చేశారు. మంగళవారం తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “సాగుఖర్చులు అత్యధికంగా పెరిగాయి. ధరలు కుప్పకూలడంతో రైతులు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ధరల పతనంపై చర్యలు ప్రకటించింది. సీఎం చంద్రబాబు కేంద్రానికి ఈ విషయంలో లేఖ కూడా రాశారు” అని వివరించారు.
కేంద్ర‌మే నేరుగా కొనుగోలు చేయాలి


ఉభ‌య గుంటూరు జిల్లాలో మిర్చి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గినా ధరలు మాత్రం ఆశాజనకంగా లేవని, నల్లతామర, జెమిని వైరస్ ప్రభావంతో సగటు దిగుబడులు కూడా పడిపోయాయని, అయినా రైతులు ఆశించిన గిట్టుబాటు ధర అంద‌క న‌ష్ట‌పోయే ప్ర‌మాదం ఉంద‌ని బాలాజి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మిర్చి సాగు ఖర్చులు ఏటికేడాది పెరుగుతున్నాయని, నాలుగేళ్ల కిందట ఎకరా మిర్చి సాగుకు లక్షన్నర వరకు ఖర్చయితే , నేడు ఎకరా మిర్చి సాగుకు రూ.2.8 లక్షలు ఖర్చవుతోందని, కౌలు రైతులకు ఖర్చు మరింత పెరుగుతోందన్నారు. మార్కెట్ హెచ్చుతగ్గుల నియంత్రణకు ప్రత్యేక చట్టాల ద్వారా చెక్ పెట్టాల్సి అవ‌స‌రం ఉంద‌న్నారు. .రైతులను ఆదుకునేందుకు మ‌ద్ద‌తు ధ‌ర ప్ర‌క‌టించి కేంద్ర ప్రభుత్వం నేరుగా మిర్చిని కొంటే కొంత‌మేర ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంద‌ని తెలిపారు.