
చిలకలూరిపేట.. కౌన్సిలర్లు, అధికారులు వారానికోసారి ప్రజల్ని కలిసి వారి సమస్యలు తెలుసుకోవాలి : మాజీమంత్రి ప్రత్తిపాటి.*

- మున్సిపాలిటీ పరిధిలో జరిగిన గ్రీవెన్స్ లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ప్రత్తిపాటి.
- రోడ్లపై గుంతలు, డ్రైనేజ్ ల నిర్మాణం, చేపలమార్కెట్ ఏర్పాటు, కుక్కల బెడద, టిడ్కో ఇళ్ల సముదాయంలో ప్రార్థనా మందిరాల నిర్మాణ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం కూటమిప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించాలంటే, అధికారులు… స్థానిక ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో నిత్యం ప్రజలకు అందుబా టులో ఉండాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. శనివారం ఆయన పట్టణంలోని మున్సిపాలిటీలో నిర్వహించిన గ్రీవెన్స్ లో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పట్టణవ్యాప్తంగా వివిధ వార్డుల నుంచి వచ్చిన ప్రజలతో నేరుగా మాట్లాడిన మాజీమంత్రి, వారి సమస్యల పరిష్కారం దిశగా అప్పటికప్పుడే అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలోని ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని ఫిర్యాదుల రూపంలో తన దృష్టికి తీసుకొచ్చారని, ఎక్కువగా రోడ్లు ఎగుడుదిగుడుగా, గుంతలతో ఉండటం, డ్రైనేజ్ ల నిర్మాణం, తాగునీటి సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయన్నారు. ప్రజల సమక్షంలోనే అధికారులతో మాట్లాడిన మాజీమంత్రి, సమస్యల పరిష్కారానికి అధికారులకు తగు సూచనలు ఆదేశాలిచ్చారు. స్థానిక కౌన్సిలర్లు, అధికారులు వారానికోసారి వార్డుల్లో పర్యటించి, ప్రజలకు అందుతున్న సేవల్ని పరిశీలించి, వారి సమస్యలు తెలుసుకోవాలని ఈ సందర్భంగా ప్రత్తిపాటి ఆదేశించారు. గ్రీవెన్స్ లో ఇచ్చిన ప్రతి అర్జీదారుని సమస్య పరిష్కారం కావాలని, మరలా తానే స్వయంగా వారితో మాట్లాడి, వారి సంతృప్తిని తెలుసుకుంటానని ఆయన తెలిపారు. చేపలమార్కెట్ నిర్మాణ ప్లాన్ త్వరగా సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించిన ఆయన, 2019కి ముందు కొత్తగా చేపలమార్కెట్ నిర్మాణం చేపట్టడటం జరిగిందని, వైసీపీప్రభుత్వం రావడంతో ఆ పనులన్నీ నిలిచిపోయాయన్నారు. శివారు కాలనీలకు కూడా తాగునీరు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, పట్టణంలో ఎక్కడా తాగునీటి ఇబ్బందులు ఉండకూడదన్నారు. పట్టణంలో కుక్కల సంచారం లేకుండా చూడాలని, వీధికుక్కల్ని పట్టి, జనావాసాలకు దూరంగా తరలించాలన్నారు. టిడ్కో ఇళ్ల సముదాయంలో ప్రార్థనా మందిరాల నిర్మాణానికి అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలని అధికారులకు సూచించిన మాజీమంత్రి, అక్కడ అసాంఘిక కార్యకలపాలకు తావు లేకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, డిఈ రహీం, పట్టణ సీఐ రమేష్ బాబు, మున్సిపల్ కౌన్సిలర్లు, కూటమి నాయకులు ,అధికారులు, తదితులున్నారు.