వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు సాగు చేయాలి….

TEJA NEWS

వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు సాగు చేయాలి….

– జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష….

రాష్ట్రంలో నెలకొన్న సూపర్ ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా రైతులు అధిక నీటి అవసరమయ్యే వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. అలాగే భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తి చేసి బీఎల్‌వోలకు అందజేయాలని కోరారు.

ఓదెల మండలంలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ కొలనూర్ గ్రామపంచాయతీలో ఎస్‌ఐఆర్ ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించారు. అనంతరం రైతులతో సమావేశమై పంటల మార్పిడిపై అవగాహన కల్పించి పంట పొలాలను సందర్శించారు. అలాగే ఓదెల జడ్‌పీహెచ్‌ఎస్ పాఠశాల, మోడల్ స్కూల్ & జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, నూతన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణ గడువును భారత ఎన్నికల సంఘం ఆగస్టు 3 వరకు పొడిగించిందన్నారు. బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ప్రతి ఓటరికి ఫారాలు అందించి పూర్తిగా నింపించి తిరిగి సేకరించాలని ఆదేశించారు. ఓటర్లు కూడా ఫారాలను సకాలంలో పూర్తి చేసి బీఎల్‌వోలకు అందజేయాలని సూచించారు. రాజకీయ పార్టీల బీఎల్‌ఏలు, వాలంటీర్లు, సామాజిక కార్యకర్తలు ఈ ప్రక్రియలో సహకరించాలని కోరారు.

సూపర్ ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతోందని, సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, భూగర్భ జలాలు తగ్గుతున్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో వరి సాగుకు బదులుగా చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఆయిల్‌పామ్ వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. ప్రభుత్వం అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచిందని, వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు.

పాఠశాలల తనిఖీలో భాగంగా ఉపాధ్యాయులకు విద్యా ప్రణాళిక ప్రకారం సిలబస్‌ను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, ప్రతి విద్యార్థికి అన్ని సబ్జెక్టులపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి అదనపు బోధన అందించాలని ఆదేశించారు. విద్యార్థులతో మాట్లాడి పాఠశాలలోని సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం ఓదెల మండల కేంద్రంలోని నూతన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని పరిశీలించిన కలెక్టర్, మిగిలిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, తహసీల్దార్ వనజ, వ్యవసాయ శాఖ, విద్యాశాఖ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top