మచిలీపట్నంకు అతి దగ్గరలో తుపాను..
రాత్రికి తీరం దాటే ఛాన్స్ పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను తీరంవైపుగా దూసుకొస్తోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 17 కిలోమీటర్ల వేగంతో…
స్పెషల్ కరెస్పాండెంట్ రిపోర్టర్ టివి ఆం ప్ర : పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను తీరంవైపుగా దూసుకొస్తోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదిలిన మొంథా తుపాన్ (Montha Cyclone) మచిలీపట్నంకి 230 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే కాకినాడకు 310 కిలోమీటర్లు, విశాఖపట్నంకు 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. ఈ తుపాను మరికాసేపట్లో తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించింది.
నేటి రాత్రికి మచిలీపట్నం – కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు APSDMA తెలిపింది. తుపాను ప్రభావంతో రేపు కోస్తా జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది. తీరందాటే సమయంలో తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
కాగా.. సైక్లోన్ ప్రభాంతో ఇప్పటికే తీరప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 95 ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
తుపాను నేపథ్యంలో బాపట్ల జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. బాపట్ల లో షాపులు మూసివేయాలని సూచించారు. మెడికల్, పాలు, కూరగాయలు వంటి అత్యవసర వస్తువులు విక్రయించే షాపులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవ్వరూ ఇళ్ల నుంచి బయటికి రావొద్దని హెచ్చరించారు.
బాపట్ల లో సముద్ర తీర ప్రాంతాలలో తుపాను ప్రభావం తీవ్రంగా ఉండనున్న నేపథ్యంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. తీరప్రాంతంలో 4 లక్షల మందిపై ప్రభావం ఉంటుందని, సూర్యలంక సమీపంలోనే తీరందాటే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. దీంతో ముందు జాగ్రత్తగా ప్రజలకు సహాయక చర్యలు అందించేందుకు సహాయ ఏర్పాటు చేస్తున్నారు. వాతావరణశాఖ రాష్ట్రంలో 17 జిల్లాలకు రెడ్ అలర్ట్, 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
