TEJA NEWS

కులాంతర వివాహం చేసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన కూతురు.. మనవరాలు పుట్టాక తిరిగొచ్చింది. ఈసారి తమ కులంలోనే మంచి సంబంధం చూసి కూతురుకు మళ్లీ పెళ్లి చేయాలని ఆ తల్లి భావించింది. రెండో పెళ్లికి అడ్డంకిగా మారుతుందనే ఉద్దేశంతో మనువరాలు, ఐదు నెలల పసికందును హత్య చేసింది. ఈ అమానవీయ సంఘటన ఏపీలోని పిఠాపురం మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

పిఠాపురం మండలం నరసింగపురానికి చెందిన శైలజ, సతీష్ ప్రేమించుకున్నారు. రెండేళ్ల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. రెండేళ్ల వారి కాపురానికి గుర్తుగా యశ్విత పుట్టింది. సతీష్ ది తమ కులం కాకపోవడంతో శైలజ తల్లికి ఈ పెళ్లి ఇష్టంలేదు. ఈ క్రమంలోనే సతీష్ తో మనస్పర్థల కారణంగా బిడ్డను తీసుకుని శైలజ పుట్టింటికి చేరుకుంది. మనవరాలితో వచ్చిన కూతురును ఆదరించిన తల్లి అన్నవరం.. నెమ్మదిగా శైలజ మనసు మార్చింది. తమ కులంలోనే మంచి యువకుడిని చూసి మళ్లీ పెళ్లి చేస్తానని చెప్పింది.

పునర్వివాహానికి బిడ్డ అడ్డంకిగా మారుతుందనే ఉద్దేశంతో బిడ్డను అడ్డుతొలగించుకోవాలని ఇద్దరూ కలిసి పథకం వేశారు. ఈ నెల 6న పసికందు యశ్విత గొంతు నులిమి హత్య చేశారు. ఆపై పక్కింట్లోని బావిలో పడేశారు. గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసి తన బిడ్డను చంపేశారని శైలజ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులను నమ్మించేందుకు ఇంటి ముందు ముగ్గు వేసి, నిమ్మకాయలు పెట్టి క్షుద్ర పూజలు జరిగినట్లు తల్లీకూతుళ్లు సీన్ సృష్టించారు. తల్లీకూతుళ్ల ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా తాము చేసిన ఘోరాన్ని వారు బయటపెట్టారు. రెండో పెళ్లికి అడ్డుగా మారుతుందనే ఉద్దేశంతో తామే పసిబిడ్డను హత్య చేసినట్లు అంగీకరించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి తల్లీకూతుళ్లను అదుపులోకి తీసుకున్నారు.