
గోదావరి పుష్కరాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు, గూడెం ఘాట్‌ను పరిశీలించిన డీసీపీ భాస్కర్…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:మంచిర్యాల,
వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ అధికారులను ఆదేశించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు మంచిర్యాల జోన్ పరిధిలోని లక్షెట్టిపేట, దండేపల్లి పోలీస్ స్టేషన్‌ల పరిధిలో ఉన్న గూడెం దేవాలయం ఘాట్‌ను డీసీపీ ఎ. భాస్కర్, మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్, సీఐ రమణమూర్తి, సంబంధిత శాఖల అధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఘాట్ వద్ద చేపడుతున్న అభివృద్ధి పనులు, భక్తుల రాకపోకలకు అవసరమైన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు.
డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ, గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విస్తృత స్థాయిలో ముందస్తు చర్యలు ప్రారంభించిందన్నారు. మంచిర్యాల టౌన్ ఘాట్, గూడెం దేవాలయం ఘాట్, చెన్నూరు ఉత్తరవాహిని గోదావరి ఘాట్‌లను టైర్-1 ఘాట్‌లుగా, లక్షెట్టిపేట ఘాట్‌ను టైర్-2గా, జిల్లాలోని మరో పది ఘాట్‌లను టైర్-3 కింద గుర్తించినట్లు తెలిపారు.
పుష్కరాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని సమగ్ర భద్రతా ప్రణాళికను రూపొందిస్తున్నామని చెప్పారు. ఘాట్‌ల వద్ద కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ, సీసీటీవీ కెమెరాలు, వీడియో అనలిటిక్స్ సాంకేతికతను వినియోగించి భక్తుల రద్దీని నిరంతరం పర్యవేక్షించనున్నట్లు తెలిపారు.
రద్దీ పరిస్థితులకు అనుగుణంగా ట్రాఫిక్ మళ్లింపు, ఘాట్ సామర్థ్య నిర్వహణ, అత్యవసర సేవల సమన్వయంపై ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని వెల్లడించారు.
పరిశీలనలో గుర్తించిన అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి, పుష్కరాల సందర్భంగా భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు అన్ని శాఖల సమన్వయంతో చర్యలు చేపడతామని డీసీపీ భాస్కర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి, తహసీల్దార్, ఇరిగేషన్ శాఖ ఏఈ, ఏసీపీ ఆర్. ప్రకాష్, సీఐ రమణమూర్తి, ఎస్‌ఐలు సురేష్, రాజవర్ధన్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.