Spread the love

దక్షిణాదిలో బీజేపీ బలపడకూడదనే డీలిమిటేషన్‌ డ్రామా – కిషన్‌రెడ్డి

దక్షిణాదిలో బీజేపీ బలపడకూడదనే ఉద్దేశ్యంతో డీలిమిటేషన్‌ పేరుతో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, డీఎంకే కుట్ర చేస్తున్నాయని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఆరోపించారు. స్టాలిన్‌ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది…

తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటోంది… ఈ ప్రజా వ్యతిరేకతను డైవర్ట్‌ చేసేందుకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ డీలిమిటేషన్‌ మీటింగ్‌ పెట్టారని అన్నారు.

ఇదే సమయంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ జతకట్టిపోవడం వాళ్ల చీకటి ఒప్పందానికి నిదర్శనమని ఘాటు విమర్శలు చేశారు.

అంతేకాదు దేశంలో డీలిమిటేషన్‌పై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేసారు.

హైదరాబాద్ లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ… ‘డీలిమిటేషన్‌పై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల నిజస్వరూపం మరోసారి బయటపడింది. దక్షిణాదికి అన్యాయం చేసి బీజేపీ బలపడాలని అనుకోవడం లేదు.

దక్షిణాదికి అన్యాయం చేసి బీజేపీ బలపడాలని అనుకోవడం లేదు. దక్షిణాదిలో బీజేపీ బలపడకూడదని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, డీఎంకే కుట్ర చేస్తున్నాయి. చెన్నై సమావేశానికి బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ జతకట్టిపోవడం వాళ్ల చీకటి ఒప్పందానికి నిదర్శనం. దేశంలో లేని సమస్యను సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. లేని డీలిమిటేషన్‌పై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ రాజకీయం చేస్తున్నాయి.

తమిళనాడులో కుటుంబ, అవినీతి పాలన నడుస్తోంది. డీలిమిటేషన్‌ పై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బీజేపీపై తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నాం. కుటుంబ, అవినీతి పార్టీలు మోదీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఎలాంటి వివక్ష లేకుండా అన్ని రాష్ట్రాలు అభివృద్ధి జరగాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారు. స్టాలిన్‌ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. తండ్రీకొడుకులు అక్కడ ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. భాషల పేరు మీద దక్షిణాదికి అన్యాయం చేయాలని బీజేపీ అనుకోవడం లేదు.

దక్షిణాది ప్రజలు బీజేపీవైపు చూస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను డైవర్ట్‌ చేసేందుకు డీలిమిటేషన్‌ మీటింగ్‌ పెట్టారు. కాంగ్రెస్‌ కేవలం మూడు రాష్ట్రాలకే పరిమితమైంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలంగాణ, కర్ణాటకలో అధికారం బీజేపీదే. డీలిమిటేషన్‌ చేయాలంటే పార్లమెంట్‌లో చట్టం చేయాలి. ఇంకా జనాభా లెక్కల సేకరణే జరగలేదు’ అని చెప్పుకొచ్చారు.