పోలీస్ వాహనాల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు

TEJA NEWS

పోలీస్ వాహనాల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు
ప్రజలకు సేవల్లో ఆటంకం లేకుండా వాహనాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి….

–సీపీ అంబర్ కిషోర్ ఝా…

పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, రామగుండం,
పోలీస్ వాహనాలను ఎల్లప్పుడూ మంచి స్థితిలో ఉంచి, అత్యవసర సమయాల్లో తక్షణమే వినియోగించుకునేలా సిద్ధంగా ఉంచాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులను ఆదేశించారు.

రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రధాన కార్యాలయంలో పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల పరిధిలోని పోలీస్ స్టేషన్లకు చెందిన వాహనాల పనితీరు, నిర్వహణను సీపీ పరిశీలించారు. వాహనాల్లోని సమాచార ప్రసార పరికరాల పనితీరును తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీస్ వాహనాలు నిరంతరం అందుబాటులో ఉండేలా సక్రమంగా నిర్వహించాలని, వాహనాల కారణంగా ప్రజలకు అందించే పోలీస్ సేవల్లో ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని సూచించారు. వాహనాల్లో ప్రథమ చికిత్స పెట్టె, అత్యవసర దీపం, తాళ్లు, ట్రాఫిక్ కోన్లు, నేరస్థల రక్షణ రిబ్బన్లు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని తెలిపారు.

అదేవిధంగా హెల్మెట్, రాళ్ల దాడుల నుంచి రక్షణ కవచం, లాఠీ, శరీర రక్షణ కవచం, ప్రతిఫలించే భద్రతా జాకెట్లు వంటి రక్షణ సామగ్రిని ప్రతి పోలీస్ వాహనంలో సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
వాహనాల నిర్వహణలో లోటుపాట్లను ఎప్పటికప్పుడు గుర్తించి సరిదిద్దాలని, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను ప్రతి నెలా సమర్పించాలని మోటారు వాహనాల అధికారులను ఆదేశించారు. పోలీస్ వాహనాలను సొంత వాహనాల మాదిరిగా జాగ్రత్తగా నిర్వహించాలని డ్రైవర్లకు సూచించారు.

నిర్ణీత వ్యవధిలో వాహనాల మరమ్మతులు, ఇంజిన్‌ నూనె మార్పు, టైర్ల నిర్వహణ తదితర అంశాల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. వాహనాల నిర్వహణపై డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించి, వాహనాల పనితీరు, భద్రతా ప్రమాణాలపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

You cannot copy content of this page

Scroll to Top