
అర్జీల పరిష్కారంలో జాప్యానికి తావివ్వొద్దు….
—జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష….
పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: పెద్దపల్లి, ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన అర్జీలను అత్యంత ప్రాధాన్యంతో పరిశీలించి, పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ కొప్పుల వెంకటరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి కలిసి ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు.
సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామానికి చెందిన నోముల రాజేశ్వర్ రెడ్డి తమ ఇంటిని ఆన్లైన్లో నమోదు చేసేందుకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ఎంపీడీఓకు ఆదేశాలు జారీ చేస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
రామగుండం గౌతమీనగర్‌కు చెందిన డి. కాశయ్య, మల్కాపురం గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 125/3లో ఉన్న 20 ఎకరాల భూమిని 1981లో మాజీ సైనికులకు కేటాయించారని, ఆ భూమిలో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి అనుమతులు ఇవ్వవద్దని కోరుతూ దరఖాస్తు సమర్పించారు. దీనిపై ఆర్డీవో పెద్దపల్లికి నివేదిక కోరుతూ తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
ఓదెల మండలం గూడెం గ్రామానికి చెందిన వేముల నర్సమ్మ తన సర్వే నెంబర్ 474/1లోని ఒక ఎకరం భూమిని కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై తహసీల్దార్‌కు నిబంధనల ప్రకారం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
గోదావరిఖని సూర్యనగర్‌కు చెందిన ఆర్. రాధ తన కుమారుడికి ప్రభుత్వ విద్యాసంస్థ హాస్టల్లో సీటు మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారికి దరఖాస్తును పంపిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రతి దరఖాస్తుకు సమయానుకూలంగా స్పందించి పరిష్కారం చూపాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.