కార్మికులను నేరస్థుల్లా చూడొద్దు”….

TEJA NEWS

కార్మికులను నేరస్థుల్లా చూడొద్దు”….

ఎన్టీపీసీ పివిసి సర్క్యులర్, మెడికల్ టెస్టులపై జేఏసీ కార్మికుల భారీ నిరసన….
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:ఎన్టీపీసీ
ఎన్టీపీసీ సంస్థ అభివృద్ధిలో అహర్నిశలు శ్రమిస్తూ తమ చెమటను ధారబోస్తున్న కాంట్రాక్టు కార్మికుల పట్ల ఎన్టీపీసీ యాజమాన్యం అవలంబిస్తున్న నిరంకుశ వైఖరిని నిరసిస్తూ, గురువారం ఎన్టీపీసీ ప్లాంట్ గేట్-2 వద్ద జేఏసీ కాంట్రాక్టు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మొదటి షిఫ్ట్ , జనరల్ షిఫ్ట్ కార్మికులు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు విధులను బహిష్కరించి భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా జేఏసీ కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ, ఎన్టీపీసీ యాజమాన్యం ప్రస్తుత నిబంధనలకు విరుద్ధంగా తీసుకొచ్చిన పోలీస్ వెరిఫికేషన్ (పి వి సి) సర్క్యులర్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా సంస్థలో నిబద్ధతతో పనిచేస్తున్న కార్మికులను నేరస్థుల్లా భావిస్తూ పోలీస్ వెరిఫికేషన్ పేరుతో ఆంక్షలు విధించడం అన్యాయమని మండిపడ్డారు.

అలాగే కార్మికులను శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురిచేసే విధంగా అమలు చేస్తున్న ప్రస్తుత మెడికల్ టెస్టులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఆరోగ్య పరిరక్షణ పేరుతో వేధింపులకు పాల్పడటం సరైంది కాదని, కార్మికుల గౌరవాన్ని దెబ్బతీసే విధానాలను యాజమాన్యం వెంటనే నిలిపివేయాలని హెచ్చరించారు.

గతంలో కూడా కార్మికులంతా ఐక్యంగా పోరాడి ఎన్నో హక్కులను సాధించుకున్నామని, అదే ఐక్యతతో యాజమాన్యం దిగివచ్చేవరకు జేఏసీ నాయకత్వంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.

కార్మికుల న్యాయమైన డిమాండ్లు అయిన పోలీస్ వెరిఫికేషన్ సర్క్యులర్ రద్దు, మెడికల్ టెస్టుల ఉపసంహరణపై యాజమాన్యం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని జేఏసీ కార్మిక సంఘాల నాయకులు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జేఏసీ కార్మిక సంఘాల నాయకులు కౌశిక్ హరి, రాజమల్లయ్య, నాంసాని శంకర్, ఆర్ లక్ష్మణ్, గీట్ల లక్ష్మారెడ్డి, దండ రాఘవరెడ్డి, చిలుక శంకర్, బుచ్చన్న, బి చందర్, ఎండి జమీల్, ఈ భూమయ్య, తోకల రమేష్, రాజేందర్, పురుషోత్తం, ఏ శ్రీనివాస్, డి సత్యం, సిహెచ్ సత్యం, ఏం రామాచారి, టి సత్యనారాయణ, కే మల్లేష్, కే రాజ్ కుమార్, టి రవీందర్, ఏ రమేష్, మహేందర్, అక్కపాక శంకర్, అజయ్ తదితరులు, పెద్ద సంఖ్యలో కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top